Breaking News

వెంకటాపూర్‌లో పసిబిడ్డతో మహిళ నిరాహార దీక్ష

ఆడపిల్ల పుట్టిందని వేధింపులు.. అదనపు కట్నం కోసం చిత్రహింసలు చేశారంటూ ఆరోపణలు

అత్తగారింటి గేటుకు తాళం.. న్యాయం జరిగే వరకు దీక్ష విరమించనని అరుణ స్పష్టం

కోరుట్ల, అక్టోబర్ (E6tv న్యూస్).

జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం వెంకటాపూర్ గ్రామంలో ఓ మహిళ తన పసిబిడ్డతో కలిసి భర్త ఇంటి ఎదుట నిరాహార దీక్షకు దిగింది. ఆడపిల్ల పుట్టిందనే కారణంతో వేధింపులకు గురిచేశారని, అదనపు కట్నం తీసుకురావాలంటూ చిత్రహింసలు పెట్టారని బాధితురాలు బర్కమ్ అరుణ ఆరోపించింది. తనకు, తన కుమార్తె హారికకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఆదివారం అత్తగారింటి గేటు ముందు దీక్ష చేపట్టింది.

వివాహ సమయంలో 14 తులాల బంగారం, రూ.4 లక్షల నగదు ఇచ్చామంటూ..

బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం.. జగిత్యాల జిల్లా బుగ్గారం మండలం గోపులాపూర్ గ్రామానికి చెందిన గోవిందుల అరుణ అలియాస్ బర్కమ్ అరుణకు, వెంకటాపూర్ గ్రామానికి చెందిన బర్కమ్ గణేష్‌తో 2023 ఆగస్టు 31న వివాహం జరిగింది. వివాహ సమయంలో తన తల్లిదండ్రులు 14 తులాల బంగారం, రూ.4 లక్షల నగదుతో పాటు ఇతర లాంఛనాలు అందజేశారని అరుణ తెలిపింది. వీరికి హారిక అనే కుమార్తె జన్మించగా, ఆడపిల్ల పుట్టిందనే కారణంతో తనను వేధించారని ఆరోపించింది.అదనపు కట్నం తీసుకురావాలంటూ భర్త గణేష్‌తో పాటు అత్త బర్కమ్ రాజు, మామ బర్కమ్ గంగాధర్, మరిది బర్కమ్ ప్రణీత్ తనను మానసికంగా, శారీరకంగా వేధించారని అరుణ ఆరోపించింది. గతంలో తనను, తన తల్లి గోవిందుల పద్మను సైతం కొట్టి గాయపరిచారని పేర్కొంది.

ఇంటికి తాళాలు వేసి వెళ్లిపోయారని ఆరోపణ

తన కుమార్తె పుట్టినప్పటి నుంచి తల్లీబిడ్డను ఇంట్లోకి రానివ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారని అరుణ ఆవేదన వ్యక్తం చేసింది. వివాహ సమయంలో తన తల్లిదండ్రులు ఇచ్చిన బంగారం, నగదును కూడా తిరిగి ఇవ్వడం లేదని ఆరోపించింది. పలుమార్లు గ్రామ పెద్దలను ఆశ్రయించి తనకు, తన బిడ్డకు న్యాయం చేయాలని కోరినా ఫలితం లేకపోయిందని తెలిపింది.

ఆదివారం తన పసిబిడ్డతో కలిసి భర్త ఇంటికి వెళ్లగా, తన రాకను గమనించిన భర్త, అత్త, మామ, మరిది ఇంటికి, గేటుకు తాళాలు వేసి అక్కడి నుంచి వెళ్లిపోయారని అరుణ ఆరోపించింది. దీంతో చేసేదేమీ లేక గేటు ముందే నిరాహార దీక్షకు దిగినట్లు వెల్లడించింది.

తండ్రి మృతి.. ఆర్థిక ఇబ్బందులతో సతమతం

ఇటీవల తన తండ్రి విదేశాల్లో మృతి చెందారని, ఇప్పటికే కుటుంబం అప్పుల భారంతో ఇబ్బందులు ఎదుర్కొంటోందని అరుణ తెలిపింది. పసిబిడ్డను పోషించలేక, తనకు ఉపాధి లేక ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నానని కన్నీటిపర్యంతమైంది. తాను, తన కుమార్తె అనారోగ్యానికి గురైనా భర్త, అత్తమామలు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేసింది.

తనకు, తన బిడ్డకు న్యాయం చేయడంతో పాటు వివాహ సమయంలో తన తల్లిదండ్రులు ఇచ్చిన 14 తులాల బంగారం, రూ.4 లక్షల నగదును తిరిగి ఇప్పించాలని అధికారులను వేడుకుంది. తన కుమార్తె హారిక భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని న్యాయం జరిగే వరకు భర్త ఇంటి ఎదుట నిరాహార దీక్ష కొనసాగిస్తానని అరుణ స్పష్టం చేసింది.గత రెండున్నరేళ్లుగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నానని చెబుతున్న బాధితురాలికి న్యాయం చేయాలని, సంబంధిత అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని ఆమె కోరుతోంది. ఈ ఆరోపణలపై భర్త, అత్తమామలు, ఇతర కుటుంబ సభ్యుల వివరణ అందుబాటులో లేదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *