సరస్వతీ అమ్మవారి ఆలయ నిర్మాణ పనులు వేగవంతం చేయాలి
అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా
బాసర, నవంబర్ 04 (E6 న్యూస్).
రానున్న గోదావరి పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేపట్టాలని నిర్మల్ జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా సంబంధిత అధికారులను ఆదేశించారు. పుష్కరాల ప్రారంభం నాటికి అన్ని అభివృద్ధి, నిర్మాణ పనులను పూర్తి చేయాలని స్పష్టం చేశారు.
బుధవారం బాసరలోని ఆలయ ఈవో కార్యాలయంలో గోదావరి పుష్కరాల ఏర్పాట్లు, సరస్వతీ అమ్మవారి ఆలయ నిర్మాణ పనుల పురోగతిపై వివిధ శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా శాఖల ఆధ్వర్యంలో చేపడుతున్న పనుల వివరాలను అడిగి తెలుసుకున్నారు.పుష్కర ఘాట్ల మరమ్మతులు, నూతన ఘాట్ల నిర్మాణం, మరుగుదొడ్లు, దుస్తులు మార్చుకునే గదులు, పిండ ప్రదాన ప్రాంతం, పోలీస్ కమాండ్ కంట్రోల్ కేంద్రం, భక్తుల వాహనాల పార్కింగ్, వీఐపీ పార్కింగ్ వంటి పనులను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని ఆదేశించారు. భక్తుల రద్దీకి అనుగుణంగా అవసరమైన మౌలిక వసతులు కల్పించాలని, పుష్కరాలకు వచ్చే ప్రముఖుల వసతి కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని సూచించారు.
ప్రతి పనికి స్పష్టమైన కార్యాచరణ ప్రణాళిక రూపొందించి, పనులను వేగవంతం చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. అనంతరం సరస్వతీ అమ్మవారి ఆలయ నిర్మాణ పనుల పురోగతిని సమీక్షించిన కలెక్టర్.. పనుల్లో ఎలాంటి జాప్యం జరగకుండా నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని ఆదేశించారు. నిర్మాణ పనుల్లో నాణ్యతా ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలని స్పష్టం చేశారు.పుష్కరాల ఏర్పాట్లు, ఆలయ నిర్మాణ పనులను సంబంధిత శాఖల అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తూ, ఎప్పటికప్పుడు పురోగతిపై సమీక్షించాలని సూచించారు.
ఈ సమావేశంలో ఆర్ అండ్ బీ ఈఈ సుభాష్, ఉద్యానవన శాఖ అధికారి రమణ, ఆలయ ఈవో అంజనాదేవి, తహసీల్దార్ పవన్ చంద్ర, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

