గ్రామంలో మౌలిక వసతులు కల్పించడంలో విఫలమయ్యారని ఆరోపణ
కలుషిత తాగునీరు, వీధి దీపాలు, మురుగు కాలువల సమస్యలతో అవస్థలు
ప్రశ్నిస్తే దౌర్జన్యం చేస్తున్నారంటూ అధికారులకు ఫిర్యాదు
తమకు న్యాయం చేయాలని గ్రామస్తుల నిరసన
రుద్రూర్, నవంబర్ 16: (E6tv NEWS).
నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండలం కొండాపూర్ గ్రామంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించడంలో సర్పంచ్ గొంటి సాయిలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని గ్రామస్తులు ఆరోపించారు. గ్రామంలో కనీస మౌలిక వసతులు కల్పించకుండా, సమస్యలపై ప్రశ్నించిన ప్రజల పట్ల దురుసుగా ప్రవర్తిస్తూ దౌర్జన్యం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమ సమస్యలను పరిష్కరించి న్యాయం చేయాలని కోరుతూ సోమవారం రుద్రూర్ మండల కేంద్రంలో అధికారులకు ఫిర్యాదు చేసి నిరసన తెలిపారు.ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ.. గతంలో తమ గ్రామం అంబం (ఆర్) గ్రామపంచాయతీ పరిధిలో ఉండేదని, నూతన గ్రామపంచాయతీ ఏర్పడిన తర్వాత సర్పంచ్ ఎన్నికైనా గ్రామంలో అభివృద్ధి పనులు ఆశించిన స్థాయిలో జరగడం లేదని ఆరోపించారు. సర్పంచ్‌గా బాధ్యతలు చేపట్టి ఏడాది గడుస్తున్నా గ్రామంలో కనీస సౌకర్యాలు కల్పించడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని విమర్శించారు.
వీధి దీపాలు లేక అంధకారంలో గ్రామం
గ్రామంలోని వీధుల్లో వీధి దీపాలు ఏర్పాటు చేయకపోవడంతో రాత్రివేళల్లో చీకటిలోనే ఉండాల్సి వస్తోందని గ్రామస్తులు తెలిపారు. మురుగు కాలువలను శుభ్రం చేయకపోవడంతో మురుగునీరు పేరుకుపోయి దుర్వాసన వెదజల్లుతోందని, అపరిశుభ్రత కారణంగా ప్రజలు అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామంలో పారిశుద్ధ్య కార్మికులను నియమించడంలో కూడా నిర్లక్ష్యం జరుగుతోందని ఆరోపించారు.
కలుషిత నీటితో ప్రజల అవస్థలు
గ్రామంలో తాగునీటి పైపులైన్లకు లీకేజీలు ఏర్పడటంతో మురుగునీరు తాగునీటిలో కలుస్తోందని గ్రామస్తులు ఆరోపించారు. కలుషిత నీటినే తాగాల్సిన పరిస్థితి ఏర్పడిందని, ఈ నీటిని వినియోగించడం వల్ల పలువురు అనారోగ్యానికి గురై ఆసుపత్రుల పాలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్యను పలుమార్లు సర్పంచ్ దృష్టికి తీసుకెళ్లినా పరిష్కారానికి చర్యలు తీసుకోవడం లేదని పేర్కొన్నారు.
ప్రశ్నిస్తే దురుసు సమాధానాలు.. గ్రామస్తుల ఆరోపణ
గ్రామ సమస్యలను పరిష్కరించాలని కోరితే ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి, ఏమి చేసుకుంటారో చేసుకోండి అంటూ సర్పంచ్ సమాధానం చెబుతున్నారని గ్రామస్తులు ఆరోపించారు. గ్రామపంచాయతీ కార్యాలయం ఎప్పుడు చూసినా తాళం వేసి ఉంటోందని, సర్పంచ్ ప్రజలకు అందుబాటులో ఉండటం లేదని తెలిపారు. గ్రామసభలు, ప్రజా సమావేశాలు నిర్వహించకపోవడంతో తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లే అవకాశం లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.గ్రామంలో రహదారులు సక్రమంగా లేకపోవడం, చెత్తాచెదారం పేరుకుపోవడం వంటి సమస్యలు కూడా ఉన్నాయని తెలిపారు. ప్రజల సమస్యలను పట్టించుకోని ఇలాంటి పాలన తమకు వద్దని, గ్రామ అభివృద్ధికి కృషి చేస్తూ ప్రజలకు అందుబాటులో ఉండే నాయకత్వం కావాలని డిమాండ్ చేశారు.
అధికారులు స్పందించి న్యాయం చేయాలి
కొండాపూర్ గ్రామంలో నెలకొన్న తాగునీరు, పారిశుద్ధ్యం, వీధి దీపాలు, రోడ్లు తదితర సమస్యలను వెంటనే పరిష్కరించాలని గ్రామస్తులు అధికారులను కోరారు. సర్పంచ్‌పై తాము చేసిన ఫిర్యాదును పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. సమస్యలు పరిష్కరించకపోతే భవిష్యత్తులో మరిన్ని ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.ఈ నిరసన కార్యక్రమంలో గ్రామస్తులు గొంటి సందీప్, గొంటి సాయిలు, గొంటి రవి, గొంటి చిన్నాన్న, మోహన్, గొడుగు సాయిలు, గొడుగు నడిపి సాయిలు, బీర్కూరు పవన్, గోవూరు విజయ్, గొడుగు సాయిలు, గొంటి సంజు, సంఘం పోశెట్టి, గొంటి సైదయ్య, గొంటి సుధాకర్, బీర్కూర్ పవన్ కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు.
