మూతపడిన మరుగుదొడ్లు.. రాత్రివేళల్లో వెలగని లైట్లు
కనీస సౌకర్యాలు లేక ప్రయాణికుల అవస్థలు
స్పందించి సమస్యలు పరిష్కరించాలని ఆర్టీసీ అధికారులకు ప్రయాణికుల విజ్ఞప్తి
ఎల్లారెడ్డి, నవంబర్ 15: (E6tv NEWS).
కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండలం గోపాల్పేట్లోని ఆర్టీసీ బస్టాండ్‌లో కనీస సౌకర్యాలు కరువై ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రయాణికుల అవసరాల కోసం ఏర్పాటు చేసిన మరుగుదొడ్లకు నీటి సరఫరా లేకపోవడంతో అవి నిరుపయోగంగా మారి మూతపడ్డాయి. దీంతో ముఖ్యంగా మహిళా ప్రయాణికులు అత్యవసర సమయాల్లో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.మరోవైపు బస్టాండ్ ఆవరణలో విద్యుత్ లైట్లు సక్రమంగా వెలగకపోవడంతో రాత్రివేళల్లో చీకటి అలుముకుంటోంది. బస్సుల కోసం వేచి ఉండే ప్రయాణికులు చీకట్లో అవస్థలు పడుతున్నారు. ముఖ్యంగా మహిళలు, వృద్ధులు భద్రతాపరమైన ఆందోళనతో పాటు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు.
వందలాది మంది ప్రయాణికులకు ఆధారమైన బస్టాండ్
జాతీయ రహదారి 765డీపై ఉన్న గోపాల్పేట్ బస్టాండ్‌కు ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. ప్రతిరోజూ వందలాది మంది ప్రయాణికులు ఇక్కడి నుంచి వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగిస్తుంటారు. నాగిరెడ్డిపేట మండలంలో ఎక్స్‌ప్రెస్ బస్సులకు స్టాప్ ఉన్న ప్రధాన బస్టాండ్ కావడంతో పాటు, లింగంపేట మండలంలోని పలు గ్రామాల ప్రజలు కూడా దూరప్రాంతాలకు వెళ్లేందుకు ఈ బస్టాండ్పైనే ఆధారపడుతున్నారు.ఇంతటి ప్రాధాన్యత కలిగిన బస్టాండ్‌లో మరుగుదొడ్లు, తాగునీరు, విద్యుత్ లైట్లు వంటి కనీస సౌకర్యాలు సక్రమంగా లేకపోవడంపై ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రయాణికుల అవసరాలను దృష్టిలో పెట్టుకొని అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
అధికారులు స్పందించేది ఎప్పుడు?
ఇప్పటికైనా ఆర్టీసీ ఉన్నతాధికారులు స్పందించి మరుగుదొడ్లకు నీటి సరఫరాను పునరుద్ధరించాలని, బస్టాండ్ ఆవరణలో రాత్రివేళల్లో లైట్లు నిరంతరం వెలిగేలా చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు విజ్ఞప్తి చేస్తున్నారు. అలాగే తాగునీరు సహా అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలను కల్పించి గోపాల్పేట్ బస్టాండ్‌ను ప్రయాణికులకు సౌకర్యవంతంగా తీర్చిదిద్దాలని కోరుతున్నారు.


