రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి కాంగ్రెస్ ప్రభుత్వ అండ
కుటుంబ పెద్ద మరణిస్తే రూ.5 లక్షల బీమా పరిహారం
నిజామాబాద్ జిల్లాలో 4,51,088 కుటుంబాలకు బీమా వర్తింపు
నిజామాబాద్, నవంబర్ 16: (E6tv NEWS).
రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి ఆర్థిక భరోసా కల్పించాలనే లక్ష్యంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఈ నెల 19వ తేదీ నుంచి ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని ప్రారంభించనున్నట్లు నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు నగేష్ రెడ్డి తెలిపారు. రాజకీయాలతో సంబంధం లేకుండా, ధనికులు, పేదలు అనే తేడా లేకుండా రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి బీమా సౌకర్యం కల్పించడమే ఈ పథకం ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు.
ఈ పథకం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా కోటి 19 లక్షల కుటుంబాలకు, నిజామాబాద్ జిల్లాలో మొత్తం 4,51,088 కుటుంబాలకు బీమా సౌకర్యం అందించనున్నట్లు వెల్లడించారు. రేషన్ కార్డు కలిగి ఉండి, కుటుంబంలో 18 నుంచి 59 సంవత్సరాల వయస్సు ఉన్నవారికి ఈ పథకం వర్తిస్తుందని వివరించారు. కుటుంబ పెద్ద మరణించిన సందర్భంలో ఆ కుటుంబానికి ప్రభుత్వం రూ.5 లక్షల బీమా పరిహారం అందిస్తుందని తెలిపారు.
ఈ నెల 19 నుంచి 30 వరకు నమోదు ప్రక్రియ
ఈ నెల 19వ తేదీ నుంచి 30వ తేదీ వరకు గ్రామగ్రామాన అధికారులు పర్యటించి అర్హులైన కుటుంబాలను పథకంలో నమోదు చేస్తారని నగేష్ రెడ్డి తెలిపారు. అధికారులు తమ వద్దకు వచ్చినప్పుడు కుటుంబ పెద్ద వివరాలతో పాటు నామినీ వివరాలను అందించాలని సూచించారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని పథకంలో నమోదు చేసుకోవాలని కోరారు.
జిల్లాలో మరో 20 వేల కొత్త పింఛన్లు
ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం నిజామాబాద్ జిల్లాలో సుమారు 20 వేల కొత్త పింఛన్లు మంజూరు చేయనున్నట్లు నగేష్ రెడ్డి వెల్లడించారు. ఇందులో భాగంగా దివ్యాంగులు, ఒంటరి మహిళలు, వితంతువులకు పింఛన్లు అందించనున్నట్లు తెలిపారు.ప్రజలకు సంక్షేమ పథకాలు అందించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుంటుందని, ప్రతి కుటుంబానికి ఆర్థిక భరోసా కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని నగేష్ రెడ్డి పేర్కొన్నారు. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల్లో ప్రజలందరూ భాగస్వాములు కావాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
