Breaking News

బాలల ప్రజావాణికి అనూహ్య స్పందన!

చిన్నారుల నుంచి 18 ఫిర్యాదులు స్వీకరణ

కలెక్టర్ ఆదేశాలతో పలు సమస్యలకు అప్పటికప్పుడే పరిష్కారం

చైల్డ్ హెల్ప్‌లైన్ 1098 పోస్టర్లను ఆవిష్కరించిన కలెక్టర్ ఇలా త్రిపాఠి

నిజామాబాద్, నవంబర్ 16: (E6tv NEWS).

బాలల హక్కుల వారోత్సవాన్ని పురస్కరించుకొని నిజామాబాద్ సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో సోమవారం ప్రత్యేకంగా నిర్వహించిన బాలల ప్రజావాణి కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన చిన్నారులు తమ సమస్యలను జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, సంబంధిత శాఖల అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.విద్య, వైద్యం, రవాణా తదితర అంశాలకు సంబంధించిన సమస్యలపై చిన్నారులు అర్జీలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో బాలలకు సంబంధించిన మొత్తం 18 ఫిర్యాదులు అందగా, కలెక్టర్ ఆదేశాల మేరకు వాటిలో చాలా వరకు సమస్యలను అధికారులు అప్పటికప్పుడే పరిష్కరించారు.

చిన్నారుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు

బాలలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తమ సమస్యలను అధికారులకు తెలియజేసేందుకు ప్రజావాణి కాన్ఫరెన్స్ హాల్‌లో ప్రత్యేక డెస్క్‌లను ఏర్పాటు చేశారు. చిన్నారుల నుంచి వినతులు స్వీకరించేందుకు సంబంధిత అధికారులను నియమించారు. బాలల సమస్యలకు ప్రాధాన్యతనిస్తూ వాటి పరిష్కారానికి చర్యలు తీసుకున్నారు.

చైల్డ్ హెల్ప్‌లైన్ 1098 పోస్టర్ల ఆవిష్కరణ

ఈ సందర్భంగా మహిళా శిశు సంక్షేమ శాఖ జిల్లా బాలల పరిరక్షణ విభాగం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న చైల్డ్ హెల్ప్‌లైన్ 1098 టోల్ ఫ్రీ నంబర్ పోస్టర్లను కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆవిష్కరించారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు, విద్యా సదుపాయాలను బాలలు సద్వినియోగం చేసుకునేలా అధికారులు కృషి చేయాలని సూచించారు.బాల్య వివాహాల నిరోధానికి అంకితభావంతో పనిచేయాలని, బడి ఈడు పిల్లలందరూ తప్పనిసరిగా విద్యను అభ్యసించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. బాలల హక్కుల పరిరక్షణకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు భుజంగరావు, రాజా గౌడ్, ట్రైనీ కలెక్టర్ సురేష్, నగర పాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, ఇన్‌చార్జి డీఈఓ సాయాగౌడ్, జిల్లా సంక్షేమ అధికారిణి సౌందర్య, జిల్లా బాలల పరిరక్షణ అధికారి చైతన్య కుమార్, చైల్డ్ హెల్ప్‌లైన్ కోఆర్డినేటర్ జోష్న తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *