యూపీఐ డిజిటల్ చెల్లింపులపై మర్చంట్ డిస్కౌంట్ రేట్ (MDR) చార్జీలు విధించనున్నారనే వార్తలపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తీవ్రస్థాయిలో స్పష్టత ఇచ్చారు. ఈ అంశంపై సాధారణ ఖాతాదారులు, వినియోగదారులు ఎంతమాత్రం ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, వారి జేబులపై ఎలాంటి అదనపు భారం పడదని స్పష్టం చేశారు. రూ. 2,000కు మించిన కొన్ని నిర్దిష్ట డిజిటల్ లావాదేవీలపై వర్తించే ఈ ఎండీఆర్ చార్జీలు కేవలం వ్యాపారుల (Merchants)కు మాత్రమే పరిమితమని, కస్టమర్లకు కాదని ఢిల్లీలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆమె తేల్చిచెప్పారు.
అది ప్రభుత్వం వసూలు చేసే పన్ను కాదు: ఎండీఆర్ అనేది కేంద్ర ప్రభుత్వం స్వీకరించే పన్ను, సెస్ లేదా సర్చార్జ్ కాదని, ఆ మొత్తం ప్రభుత్వ ఖజానాకు వెళ్లదని మంత్రి వివరించారు. బ్యాంకులు, పేమెంట్ గేట్వేలు వంటి డిజిటల్ నెట్వర్క్ వ్యవస్థలను నిర్వహించే సంస్థల వ్యయం కోసమే ఈ రుసుము దోహదపడుతుందని పేర్కొన్నారు. నిబంధనలపై సరైన అవగాహన లేకపోవడం వల్లే సామాజిక మాధ్యమాల్లో అపోహలు వ్యాపిస్తున్నాయని.. డెబిట్, క్రెడిట్ కార్డుల లావాదేవీల్లో వ్యాపారులు ఏ విధంగానైతే ఈ రుసుము భరిస్తున్నారో, యూపీఐ విషయంలోనూ వ్యాపారులే భరిస్తారని కస్టమర్లపైకి నెట్టే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.
ఉచితంగానే డిజిటల్ సేవలు: డిజిటల్ చెల్లింపులు జరిపే వినియోగదారులందరికీ సేవలు ఎప్పటిలాగే ఉచితంగా, అంతరాయం లేకుండా అందుబాటులో ఉంటాయని మంత్రి హామీ ఇచ్చారు. తప్పుడు ప్రచారాలను నమ్మి ప్రజలు ఆందోళన చెందవద్దని సూచించారు.

