పశ్చిమ బెంగాల్ బొగ్గు రంగం దశాబ్దాలుగా అక్రమ మైనింగ్ ముఠాలు, మాఫియా గుప్పెట్లో బందీగా మారిందని, గత ప్రభుత్వాల హయాంలో అక్కడ ‘జంగల్ రాజ్’ నడిచిందని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కోల్‌కతాలో అసోచామ్ (ASSOCHAM) నిర్వహించిన పారిశ్రామిక రోడ్‌షోలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ… పారదర్శకతను పెంచడం, అక్రమ కార్యకలాపాలను అరికట్టడం మరియు మైనింగ్ ద్వారా వచ్చే రాబడి నేరుగా ప్రభుత్వ ఖజానాకు చేరేలా కేంద్ర ప్రభుత్వం విప్లవాత్మక సంస్కరణలు చేపడుతోందని స్పష్టం చేశారు.
ఏలాంటి అనుమతులు, భద్రతా ప్రమాణాలు లేకుండా సాగిన అక్రమ తవ్వకాల వల్ల అనేకమంది ప్రాణాలు కోల్పోయారని, అయినా గతంలో ఎలాంటి జవాబుదారీతనం ఉండేది కాదని కిషన్ రెడ్డి ఆరోపించారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో పారదర్శక విధానాలను తీసుకురావడంతో అక్రమ నిర్వాహకులు వెనక్కు తగ్గుతున్నారని, ఫలితంగా రాష్ట్ర ప్రభుత్వానికి మైనింగ్ ఆదాయం పెరుగుతోందని చెప్పారు. అలాగే పశ్చిమ బెంగాల్‌లో పరిశ్రమలు, పెట్టుబడులను ప్రోత్సహించి మైనింగ్ రంగాన్ని అభివృద్ధి చేసేందుకు త్వరలోనే ప్రతిపక్ష నేత సువేందు అధికారిని కలవనున్నట్లు తెలిపారు.
