హైదరాబాద్ ప్రజా రవాణా వ్యవస్థలో సరికొత్త విప్లవానికి తెరలేచింది. ఇప్పటివరకు మెట్రో రైలుకు, ఆర్టీసీ బస్సులకు విడివిడిగా టికెట్లు తీసుకోవాల్సిన అవసరం లేకుండా, రెండింట్లోనూ ప్రయాణించేందుకు వీలుగా ప్రభుత్వం ‘మెట్రో-ఆర్టీసీ కామన్ పాస్’ను అందుబాటులోకి తెచ్చింది. ఈ ఇంటిగ్రేటెడ్ పాస్‌ను ప్రజాభవన్‌లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రారంభించారు. ఈ సందర్భంగా 15 మంది మంత్రుల కోసం ఆయన వన్డే కామన్ పాస్‌లను కొనుగోలు చేశారు.
ఈ కొత్త విధానాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు గాను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సహా సీఎం రేవంత్‌రెడ్డి, పలువురు మంత్రులు, ఉన్నతాధికారులు నేడు ఉదయం 10 గంటలకు బేగంపేట మెట్రో స్టేషన్ నుంచి సాధారణ ప్రయాణికుల్లా మెట్రో రైల్లో ప్రయాణించనున్నారు. ప్రజా రవాణాను ప్రోత్సహించడంలో భాగంగా ప్రభుత్వ పెద్దలే స్వయంగా ఈ పాస్‌తో ప్రయాణించడం విశేషం.
ఈ కామన్ పాస్ ధర విషయానికి వస్తే, వన్డే పాస్ రూ. 400 గాను, నెలవారీ పాస్ రూ. 8,500 గాను నిర్ణయించారు. ఈ పాస్‌లు అన్ని మెట్రో స్టేషన్లలో అందుబాటులో ఉంటాయి. లాస్ట్ మైల్ కనెక్టివిటీని మెరుగుపరచడం మరియు ప్రయాణికులకు సులభతరమైన ప్రయాణ అనుభూతిని అందించడమే లక్ష్యంగా ఈ సేవలను అనుసంధానించారు. భవిష్యత్‌లో ఆటోలతో సహా ఇతర రవాణా వ్యవస్థలను కూడా ఒకే డిజిటల్ ప్లాట్‌ఫామ్‌పైకి తీసుకురావడానికి ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది.
