సనత్‌నగర్ తెలంగాణ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (TIMS) ఆస్పత్రిని పరిశీలించేందుకు బయలుదేరిన కోరుట్ల బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని గృహనిర్బంధం చేశారు. ఆస్పత్రిలోని వైద్య సేవలు, రోగులకు అందుతున్న సౌకర్యాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి, రోగులను పరామర్శించేందుకు ఆయన బయలుదేరగా.. పోలీసులు ముందస్తుగా ఆయనను అడ్డుకోవడంతో అక్కడ కొద్దిసేపు తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు ఆస్పత్రి పరిసర ప్రాంతాల్లోనూ భారీగా భద్రతను పెంచారు.
ప్రజాసమస్యలను తెలుసుకునేందుకు, ఆస్పత్రి పరిస్థితులను పరిశీలించేందుకు వెళ్తున్న ప్రజాప్రతినిధులను అడ్డుకోవడంపై బీఆర్‌ఎస్ నాయకత్వం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఎన్నికైన ఎమ్మెల్యేను ఆస్పత్రి సందర్శనకు వెళ్లకుండా ఎందుకు నిరోధించారో స్పష్టం చేయాలని డిమాండ్ చేస్తోంది. ముందస్తు భద్రతా చర్యల్లో భాగంగానే ఈ చర్యలు చేపట్టినట్లు తెలుస్తుండగా, ప్రజాప్రతినిధిని అదుపులోకి తీసుకోవడం ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
