పోలీసుల తప్పేమీ లేదు.. ఘటనకు పోలీసులకు ప్రత్యక్ష సంబంధం లేదు: పోలీస్ కమిషనర్
నిజామాబాద్, అక్టోబర్ 5:(E6tv NEWS: శివ ఠాకూర్).
భీంగల్ పోలీస్‌స్టేషన్ ఆవరణలో ఓ వ్యక్తి పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్న ఘటనపై నిజామాబాద్ పోలీస్ కమిషనర్ స్పష్టత ఇచ్చారు. ఈ ఘటనలో పోలీసుల తప్పేమీ లేదని, ఘటనకు పోలీసు వ్యవస్థకు ప్రత్యక్ష సంబంధం లేదని తెలిపారు.
పోలీసు కమిషనర్ కార్యాలయం విడుదల చేసిన ప్రకటన ప్రకారం.. సోమవారం ఉదయం సుమారు 9.45 గంటల సమయంలో భీంగల్ పోలీస్‌స్టేషన్ ఆవరణలో పి. సుధాకర్ అనే వ్యక్తి పెట్రోల్ బాటిల్, అగ్గిపెట్టెతో వచ్చి తన ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. అక్కడే ఉన్న పోలీసు సిబ్బంది, పోలీస్‌స్టేషన్‌కు వచ్చిన ఫిర్యాదుదారులు వెంటనే మంటలను ఆర్పి అతడిని చికిత్స నిమిత్తం నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు.
ప్రాథమిక సమాచారం ప్రకారం సుధాకర్ భీంగల్ పాత బస్టాండ్‌లో టీ స్టాల్ నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. తన దుకాణానికి ఎదురుగా ఉన్న కిరాణా దుకాణం వద్ద సిగరెట్లు కొనడం లేదనే విషయంలో వివాదం ఏర్పడినట్లు పేర్కొన్నారు. ఈ విషయమై కిరాణా దుకాణదారుడు ఇద్దరు రిపోర్టర్లను సుధాకర్ వద్దకు పంపించి బెదిరించినట్లు ప్రాథమికంగా తెలిసిందని పోలీసులు వెల్లడించారు.సుధాకర్ లేట్ నైట్ వరకు దుకాణం నిర్వహిస్తున్నాడనే కారణంతో విధుల్లో భాగంగా పోలీసులు పెటీ కేసు నమోదు చేసినట్లు తెలిపారు. రిపోర్టర్లు బెదిరించిన అంశాన్ని మనసులో పెట్టుకున్న సుధాకర్ పోలీస్‌స్టేషన్‌కు వచ్చి ఆవరణలో నిప్పంటించుకున్నట్లు పోలీసుల ప్రకటనలో పేర్కొన్నారు.
పోలీసుల పాత్రపై సీపీ స్పష్టత
ఈ మొత్తం వ్యవహారంలో పోలీసు వ్యవస్థకు, సుధాకర్ ఆత్మహత్యాయత్నానికి ఎలాంటి ప్రత్యక్ష సంబంధం లేదని పోలీస్ కమిషనర్ స్పష్టం చేసినట్లు ప్రకటనలో పేర్కొన్నారు.ఘటనపై పోలీసుల నుంచి వెలువడిన అధికారిక వివరణ నేపథ్యంలో, ఘటనకు దారితీసిన పూర్తి పరిస్థితులపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

