నిరుపేదలకు పార్టీలకు అతీతంగా ఇళ్లు కేటాయించాలి
వర్ని, అక్టోబర్ 5:(E6tv NEWS: ప్రతినిధి).
ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపులో అర్హులైన నిరుపేదలకు న్యాయం జరిగేలా సమగ్రంగా సర్వే నిర్వహించి, పార్టీలకు అతీతంగా ఇళ్లను మంజూరు చేయాలని భారతీయ జనతా పార్టీ (బీజేపీ) నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం వర్ని మండల ఎంపీడీవోకు వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా బీజేపీ వర్ని మండల అధ్యక్షులు ఆవుల రమేష్ మాట్లాడుతూ.. ప్రభుత్వం కేటాయిస్తున్న ఇందిరమ్మ ఇళ్లను నిజమైన అర్హులకు అందించాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. గ్రామాల్లో సమగ్ర సర్వే నిర్వహించి, ఇల్లు లేని నిరుపేద కుటుంబాలను గుర్తించి వారికి ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. ప్రభుత్వ నిధులు పార్టీలకు అతీతంగా అర్హులైన ప్రతి నిరుపేదకు అందేలా చర్యలు తీసుకోవాలని ఎంపీడీవోను కోరినట్లు తెలిపారు.ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపులో ఎలాంటి రాజకీయ జోక్యానికి తావులేకుండా పారదర్శకంగా లబ్ధిదారులను ఎంపిక చేయాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కౌన్సిల్ మెంబర్ ఇల్టం శంకర్, మండల కిసాన్ మోర్చా అధ్యక్షులు లచ్చగ గౌడ్, సాయిబాబా, ప్రకాష్ పటేల్, ఓబీసీ వర్ని మండల అధ్యక్షులు రజనీకాంత్, జిల్లా మాజీ ఉపాధ్యక్షులు దొరబాబు తదితరులు పాల్గొన్నారు.
