పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ రాబోయే పుట్టినరోజు (అక్టోబర్ 23) సందర్భంగా ఆయన అభిమానులకు భారీ సర్ప్రైజ్ లభించనున్నట్లు సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోంది. హను రాఘవపూడి దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్, టీ-సిరీస్ సంయుక్తంగా నిర్మిస్తున్న చారిత్రక యాక్షన్ చిత్రం ‘ఫౌజీ’ నుంచి ఏకంగా 3 నిమిషాల నిడివితో కూడిన ప్రత్యేక టీజర్‌ను విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే విడుదలైన ప్రభాస్ లుక్ సినిమాపై అంచనాలను పెంచగా, ఈ టీజర్ ప్రకటనపై అధికారిక స్పష్టత కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
దీంతో పాటు ప్రభాస్ పుట్టినరోజున ఆయన నటిస్తున్న మరికొన్ని క్రేజీ ప్రాజెక్టుల నుంచి కూడా అప్‌డేట్స్ వచ్చే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కనున్న ‘స్పిరిట్’ మూవీకి సంబంధించి కీలక ప్రకటనతో పాటు, నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రాబోయే ‘కల్కి 2’ రెగ్యులర్ షూటింగ్ అక్టోబర్ నుంచే ప్రారంభమవుతుందన్న నేపథ్యంలో ఆ సినిమా నుంచి కూడా సర్ప్రైజ్ అప్‌డేట్ వస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు.
