Breaking News

పల్లెబోగుడా తండాలో ఉద్రిక్తత

అటవీ అధికారులను అడ్డుకున్న గిరిజనులు.. మహిళ ఆత్మహత్యాయత్నం

అటవీ భూమి వివాదంతో తండాలో ఉద్రిక్త పరిస్థితులు

14 ఎకరాల భూమి చదును చేసినట్లు ఆరోపణలు,

ట్రాక్టర్ల స్వాధీనానికి అటవీ అధికారుల యత్నం

పురుగుల మందు తాగి మహిళ ఆత్మహత్యాయత్నం చేసినట్లు సమాచారం

నాగిరెడ్డిపేట, అక్టోబర్ 9: (E6tv NEWS: ప్రతినిధి)

కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండలం పల్లెబోగుడా తండాలో అటవీ భూమి వివాదం ఉద్రిక్తతకు దారితీసింది. అటవీ భూమిని చదును చేసేందుకు ఉపయోగించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ట్రాక్టర్లను స్వాధీనం చేసుకునేందుకు వచ్చిన అటవీ అధికారులను గిరిజనులు అడ్డుకోవడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

అటవీ శాఖ అధికారుల వివరాల ప్రకారం, సుమారు 14 ఎకరాల అటవీ భూమిని చదును చేసేందుకు ప్రయత్నించినట్లు ఆరోపణలు రావడంతో ఎల్లారెడ్డి అటవీ రేంజ్ అధికారి రమేష్ ఆధ్వర్యంలో అధికారులు పల్లెబోగుడా తండాకు చేరుకున్నారు. భూమి చదును చేసేందుకు ఉపయోగించినట్లు భావిస్తున్న ట్రాక్టర్లను స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నించారు.అధికారులు ట్రాక్టర్లను తీసుకెళ్లేందుకు యత్నించడంతో తండాకు చెందిన మహిళలు, పురుషులు వాటి ముందు బైఠాయించి అడ్డుకున్నారు. గతంలో ఇతర ట్రాక్టర్లతో భూమిని చదును చేసినప్పుడు ఎందుకు చర్యలు తీసుకోలేదంటూ అధికారులను ప్రశ్నించారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.

మహిళ ఆత్మహత్యాయత్నం చేసినట్లు సమాచారం

ఈ ఘటనలో ఓ ట్రాక్టర్‌కు నిప్పంటించేందుకు ప్రయత్నించినట్లు సమాచారం. మరోవైపు, ట్రాక్టర్ యజమాని వినోద్ తల్లి సంత్యాలి తీవ్ర మనస్తాపానికి గురై పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు స్థానికులు తెలిపారు. అపస్మారక స్థితిలో ఉన్న ఆమెను తండావాసులు ద్విచక్ర వాహనంపై ఎల్లారెడ్డి ఆసుపత్రికి తరలించారు.

ట్రాక్టర్లు స్వాధీనం చేసుకోకుండానే వెనుదిరిగిన అధికారులు

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. ఉద్రిక్తత పెరగడంతో అటవీ అధికారులు ట్రాక్టర్లను స్వాధీనం చేసుకోకుండానే వెనుదిరిగినట్లు సమాచారం. ఈ ఘటనతో పల్లెబోగుడా తండాలో ఆందోళన నెలకొంది.అటవీ భూమి వివాదం, ట్రాక్టర్ల స్వాధీనం విషయంలో తలెత్తిన ఘర్షణాత్మక పరిస్థితులు స్థానికంగా చర్చనీయాంశంగా మారాయి. మహిళ ఆరోగ్య పరిస్థితిపై అధికారిక సమాచారం అందాల్సి ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *