గర్భిణీలకు సొంత ఖర్చులతో పౌష్టికాహారం.. వైద్య సిబ్బందికి భోజన వసతి
చెన్నేకొత్తపల్లి, అక్టోబర్ 09 (E6 NEWS: ప్రతినిధి).
ఖాకీ దుస్తుల వెనుక కఠినమైన పోలీసు విధులే కాదు.. ఆపదలో ఉన్నవారికి అండగా నిలిచే మానవత్వం కూడా ఉంటుందని చెన్నేకొత్తపల్లి ఎస్ఐ ఎస్. సత్యనారాయణ నిరూపిస్తున్నారు. విధి నిర్వహణతో పాటు సామాజిక సేవలోనూ తనదైన ముద్ర వేస్తూ పలువురి ప్రశంసలు అందుకుంటున్నారు.
శ్రీ సత్యసాయి జిల్లా, రాప్తాడు నియోజకవర్గం, చెన్నేకొత్తపల్లి మండలంలోని ఎన్.ఎస్. గేట్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో శుక్రవారం ప్రధానమంత్రి సురక్షిత మాతృత్వ అభియాన్‌లో భాగంగా ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా శిబిరానికి వచ్చిన గర్భిణీ మహిళలు, వారి సహాయకులకు ఎస్ఐ సత్యనారాయణ తన సొంత ఖర్చులతో పౌష్టికాహారం అందజేశారు. ప్రతి నెలా 9వ తేదీన నిర్వహించే ఈ శిబిరంలో ఆయన క్రమం తప్పకుండా సేవా కార్యక్రమాలు చేపట్టడం విశేషం.గర్భిణీల ఆరోగ్య పరిరక్షణలో కీలక పాత్ర పోషిస్తున్న వైద్య సిబ్బంది, ఆశా కార్యకర్తలకు సైతం భోజన వసతి కల్పిస్తూ తన ఉదారతను చాటుకున్నారు.
ఈ నెల నిర్వహించిన శిబిరంలో డాక్టర్ రవికుమార్ ఆధ్వర్యంలో గర్భిణీలకు బీపీ, షుగర్, రక్త పరీక్షలతో పాటు అల్ట్రాసౌండ్ పరీక్షలు నిర్వహించారు. అవసరమైన వారికి ఉచితంగా మందులు అందజేశారు.
పోలీసు శాఖలో బాధ్యతలు నిర్వర్తిస్తూనే ప్రజా సంక్షేమం కోసం తన వంతు సహకారం అందిస్తున్న ఎస్ఐ సత్యనారాయణ సేవలను గర్భిణీ మహిళలు, వైద్యులు, గ్రామస్తులు అభినందించారు. సొంత ఖర్చులతో పౌష్టికాహారం అందిస్తూ మాతృత్వ ఆరోగ్య పరిరక్షణకు తోడ్పడటం అభినందనీయమని, ఆయన సేవలు ఇతర ఉద్యోగులకు ఆదర్శంగా నిలుస్తాయని కొనియాడారు.

