వాషింగ్టన్ డీసీలోని భారత రాయబార కార్యాలయం వద్ద ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలపై సంచలన ఆరోపణలు చేశారు. తన పాస్‌పోర్ట్ రెన్యువల్ కాకుండా వారేమైనా ఆదేశాలు ఇచ్చారా అని ఆయన సూటిగా ప్రశ్నించారు. మూడు నెలల క్రితం దరఖాస్తు చేసుకున్నా ఇప్పటికీ పాస్‌పోర్ట్ రాకపోవడంపై ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.
2024 ఎన్నికల ప్రచారంలో విజయనగరంలో నమోదైన కేసు లేదా ఎఫ్‌సీఆర్‌ఏ సమస్యల నెపంతో తన పాస్‌పోర్ట్‌ను అడ్డుకుంటున్నారా అని పాల్ నిలదీశారు. తాను భారత్‌కు వస్తే ఇబ్బంది అని భావిస్తున్నారా అని ప్రశ్నించిన ఆయన, తాను నోరు విప్పితే ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు. న్యాయపరమైన చర్యలకు దిగేలోపే తన పాస్‌పోర్ట్‌ను పునరుద్ధరించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
