Breaking News

బుగ్గారం రైతుల ధాన్యం కొనుగోలు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలి!

బీటు కోసం 40 ఎకరాల ప్రభుత్వ స్థలం కేటాయించాలి

శాశ్వత ధాన్యం కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలి

పక్కా రోడ్డు, మౌలిక సదుపాయాలు కల్పించాలని విజ్ఞప్తి

ప్రజావాణిలో అదనపు కలెక్టర్ ఎన్. ప్రసూనాంబకు వినతిపత్రం అందజేసిన చుక్క గంగారెడ్డి

జగిత్యాల, నవంబర్ 09 (E6tv న్యూస్).

బుగ్గారం గ్రామ రైతులు ప్రతి ఏటా ఎదుర్కొంటున్న ధాన్యం కొనుగోలు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని సామాజిక హక్కుల కార్యకర్త, గ్రామ అభివృద్ధి కమిటీ వ్యవస్థాపక అధ్యక్షుడు, తెలంగాణ జన సమితి జగిత్యాల జిల్లా అధ్యక్షుడు చుక్క గంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ను కోరారు.

సోమవారం జగిత్యాల జిల్లా కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ఎన్. ప్రసూనాంబకు ఆయన వినతిపత్రం అందజేశారు. ఇదే అంశంపై బుగ్గారం మండల తహసీల్దార్‌కు సైతం వినతిపత్రం సమర్పించారు.ప్రతి సంవత్సరం వరి కోతల సమయంలో ధాన్యం విక్రయించేందుకు రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, గ్రామంలో సరైన కొనుగోలు కేంద్రం, అవసరమైన సదుపాయాలు లేకపోవడంతో ధాన్యాన్ని ఆరబెట్టడం, నిల్వ చేయడం, రవాణా చేయడంలో సమస్యలు తలెత్తుతున్నాయని గంగారెడ్డి తెలిపారు.

ఈ సమస్యకు శాశ్వత పరిష్కారంగా బుగ్గారం ఊరగట్టు శివారులో కనీసం 40 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని రైతుల అవసరాల కోసం కేటాయించాలని కోరారు. కేటాయించిన స్థలాన్ని వెంటనే చదును చేసి, ధాన్యం ఆరబెట్టడం, నిల్వ చేయడం, కొనుగోలు, రవాణాకు అనువుగా అభివృద్ధి చేయాలని విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా పక్కా రోడ్డు నిర్మించి, అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పిస్తూ శాశ్వత ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని కోరారు.ఈ సమస్యపై గతంలో పలుమార్లు మంత్రి, జిల్లా కలెక్టర్, మండల తహసీల్దార్‌లకు వినతిపత్రాలు సమర్పించినప్పటికీ ఇప్పటివరకు పరిష్కారం లభించలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రస్తుత వరి కోతల సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని సంబంధిత శాఖల అధికారులు బుగ్గారం గ్రామ పరిసర ప్రాంతాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి, రైతుల సమస్యల పరిష్కారానికి యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని చుక్క గంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ను కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *