అంగన్‌వాడీ, ఆశా వర్కర్ల సేవలు సమాజానికి ఆదర్శం: మంత్రి సత్యకుమార్
బత్తలపల్లి, సెప్టెంబర్ 26:(E6tv NEWS: ప్రతినిధి)
అంగన్‌వాడీ కార్యకర్తలు, హెల్పర్లు, ఆశా వర్కర్లు సమాజానికి అందిస్తున్న సేవలను ప్రతి ఒక్కరూ గుర్తించి గౌరవించాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ, వైద్య విద్య శాఖ మంత్రి, ధర్మవరం ఎమ్మెల్యే సత్యకుమార్ యాదవ్ అన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా బత్తలపల్లి పట్టణంలోని ఆర్కే ఫంక్షన్ హాల్‌లో బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో నిర్వహించిన అంగన్‌వాడీ ఉత్సవంలో మంత్రి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా అంగన్‌వాడీ కార్యకర్తలు, హెల్పర్లు, ఆశా వర్కర్లను శాలువాలతో సత్కరించి అభినందించారు. చిన్నారులు, తల్లులు, కుటుంబాల ఆరోగ్యం, పోషణ కోసం అంగన్‌వాడీ, ఆశా కార్యకర్తలు అందిస్తున్న సేవలు ఎంతో విలువైనవని మంత్రి పేర్కొన్నారు.అంగన్‌వాడీ కేంద్రాలు కేవలం పౌష్టికాహారం అందించే కేంద్రాలు మాత్రమే కాదని, చిన్నారుల ప్రారంభ విద్య, ఆరోగ్యం, పోషణ, బాలల అభివృద్ధికి పునాది వేసే కేంద్రాలని సత్యకుమార్ అన్నారు. ‘పోషణ్ భీ పఢాయీ భీ’ కార్యక్రమం ద్వారా ప్రారంభ విద్యకు మరింత ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలిపారు.
దేశవ్యాప్తంగా 14.03 లక్షల అంగన్‌వాడీ కేంద్రాలు సుమారు 8.98 కోట్ల మంది లబ్ధిదారులకు సేవలు అందిస్తున్నాయని మంత్రి తెలిపారు. అంగన్‌వాడీ కేంద్రాలను మరింత ఆధునికంగా తీర్చిదిద్దేందుకు సక్షమ్ అంగన్‌వాడీ కార్యక్రమం అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు.గ్రామస్థాయిలో ప్రజల ఆరోగ్య పరిరక్షణలో ఆశా వర్కర్లు కీలక పాత్ర పోషిస్తున్నారని మంత్రి కొనియాడారు. వారి సేవలను కేవలం ఒకరోజు సన్మానంతో పరిమితం చేయకుండా, సమాజానికి విస్తృతంగా పరిచయం చేసి గౌరవం పెంచాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర మహిళా మోర్చా జనరల్ సెక్రెటరీ సుష్మా, రాష్ట్ర మహిళా మోర్చా కార్యదర్శి కోటి సుధా, సత్యసాయి జిల్లా బీజేపీ ఇన్‌చార్జ్ కునిగిరి నీలకంఠ, జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు జగ్గా నాగరత్న, బత్తలపల్లి మండల అధ్యక్షుడు భాస్కర్, పట్టణ మహిళా మోర్చా అధ్యక్షురాలు కే. లక్ష్మి, బత్తలపల్లి సీడీపీఓ సరస్వతి, అంగన్‌వాడీ కార్యకర్తలు, హెల్పర్లు, ఆశా వర్కర్లు, అధికారులు, స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.



