Breaking News

రహదారిపై మరో నిండు ప్రాణం బలి!

జిల్లాపల్లి ఆబాది వద్ద కారు ఢీకొని ద్విచక్ర వాహనదారుడు సలీం మృతి

పోతంగల్, నవంబర్ 13: (E6tv న్యూస్).

నిజామాబాద్ జిల్లాలో రోడ్డు ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా పోతంగల్ మండలం జిల్లాపల్లి ఆబాది సమీపంలో శుక్రవారం ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో సలీం అనే వ్యక్తి మృతి చెందాడు. ద్విచక్ర వాహనంపై వెళ్తున్న సలీంను కారు బలంగా ఢీకొనడంతో ఈ విషాదం చోటుచేసుకుంది.వివరాల్లోకి వెళ్తే.. జిల్లాపల్లి ఆబాదికి చెందిన సలీం ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా అదే సమయంలో అటుగా వచ్చిన కారు ఆయన వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సలీంకు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న అంబులెన్స్ సిబ్బంది టెక్నీషియన్లు నారాయణ, వినోద్ సంఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రుడిని బోధన్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే సలీం మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించినట్లు సమాచారం.ఈ ఘటనతో మృతుడి కుటుంబ సభ్యులు, గ్రామస్థులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.

రోడ్డు భద్రతా చర్యలు ఎక్కడ?

జిల్లాలో తరచూ చోటుచేసుకుంటున్న రోడ్డు ప్రమాదాలు ప్రజల్లో భయాందోళన కలిగిస్తున్నాయి. వాహనాల వేగ నియంత్రణ, ప్రమాద హెచ్చరిక బోర్డుల ఏర్పాటు, రహదారుల నిర్వహణ వంటి అంశాలపై సంబంధిత అధికారులు ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.జిల్లాపల్లి ఆబాది సమీపంలో రహదారి భద్రతా పరిస్థితులను అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించాలని స్థానికులు కోరుతున్నారు. అవసరమైన చోట స్పీడ్ బ్రేకర్లు, హెచ్చరిక బోర్డులు, రాత్రివేళల్లో వీధి దీపాలు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

మరో ప్రాణం పోకముందే స్పందించండి!

మరో ప్రమాదం జరిగే వరకు వేచి చూడకుండా.. ప్రజల ప్రాణాలను కాపాడేందుకు ఇప్పటికైనా అధికారులు స్పందించాలని స్థానికులు కోరుతున్నారు.ప్రమాదానికి గల అసలు కారణాలను పోలీసులు సమగ్రంగా విచారించాలని, కారు వేగం, డ్రైవర్ నిర్లక్ష్యం, రహదారి పరిస్థితులను పరిశీలించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.ఒక కుటుంబానికి ఆధారమైన వ్యక్తి రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడం తీవ్ర విషాదకరం. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ట్రాఫిక్, పోలీసు, రహదారుల శాఖ అధికారులు సమన్వయంతో తక్షణ చర్యలు చేపట్టాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *