బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ పటేల్ కులాచారి డిమాండ్
రూ.3,000 ధరతో పాటు రూ.500 బోనస్ ఇవ్వాలి
మార్కెట్లో క్వింటాల్ ధాన్యం ధర రూ.2,700కు పడిపోయింది
ఇప్పటికే 5 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ప్రైవేటు వ్యాపారులకు విక్రయం
రైతుల వద్ద ఇంకా 7 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం నిల్వ
కొనుగోలుకేంద్రాల్లో కనీస సౌకర్యాలు కల్పించడంలో ప్రభుత్వం విఫలం
MSP అంటే కనీస మద్దతు ధర.. గరిష్ట మద్దతు ధర కాదు
నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డిపై బీజేపీ జిల్లా అధ్యక్షుడి విమర్శలు
నిజామాబాద్, నవంబర్ 13 (E6tv న్యూస్: శివ ఠాకూర్).
ధాన్యం పండించిన రైతులకు క్వింటాల్‌కు రూ.3,000 ధరతో పాటు రూ.500 బోనస్ కలిపి మొత్తం రూ.3,500 అందేలా రాష్ట్ర ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని బీజేపీ ఇందూర్ జిల్లా అధ్యక్షుడు దినేష్ పటేల్ కులాచారి డిమాండ్ చేశారు.బీజేపీ జిల్లా పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఈ వానాకాలం సీజన్లో ఇందూరు జిల్లాలో 5.35 లక్షల ఎకరాల్లో వరి సాగు చేయగా, సుమారు 12 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేసినట్లు తెలిపారు.
బాన్సువాడ, బోధన్ నియోజకవర్గాలతో పాటు ఆర్మూర్ సహా జిల్లాలోని పలు ప్రాంతాల్లో పంట కోతలు పూర్తయ్యాయని, ఇప్పటివరకు సుమారు 5 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని రైతులు మిల్లర్లు, కమీషన్ ఏజెంట్లు, దళారులకు విక్రయించారని పేర్కొన్నారు. ప్రారంభంలో క్వింటాల్‌కు రూ.3,600 పలికిన పచ్చి సన్న వడ్ల ధర ప్రస్తుతం రూ.2,700కు పడిపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.రైతుల వద్ద సుమారు 7 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం నిల్వ ఉందని, గతంలో ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల ద్వారా కనీసం 8 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసేవారని గుర్తుచేశారు. ఈసారి కొనుగోలు కేంద్రాల ప్రారంభానికి పరిమితమై, రైతులకు అవసరమైన గోనె సంచులు, సుతిలి, రవాణా సదుపాయాలు కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు.
ప్రస్తుతం మార్కెట్లో వరి బియ్యానికి డిమాండ్ ఉన్నందున రైతుల డిమాండ్ మేరకు క్వింటాల్ ధాన్యానికి రూ.3,000 ధర కల్పించి, అదనంగా రూ.500 బోనస్ అందించాలని కోరారు. ప్రభుత్వం వెంటనే పూర్తిస్థాయిలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.రైతులకు గిట్టుబాటు ధర దక్కడం లేదని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డిని ఆశ్రయిస్తే.. ‘MSP కన్నా ఎక్కువగానే వస్తోంది కదా’ అంటూ ఆయన బాధ్యతారాహిత్యంగా మాట్లాడటం శోచనీయమని దినేష్ పటేల్ విమర్శించారు. MSP అంటే మినిమం సపోర్ట్ ప్రైస్ (కనీస మద్దతు ధర) అని, మాక్సిమం సపోర్ట్ ప్రైస్ (గరిష్ట మద్దతు ధర) కాదనే కనీస అవగాహన ఎమ్మెల్యేకు ఉండాలని ఎద్దేవా చేశారు.
రైతులకు గిట్టుబాటు ధర దక్కడం లేదని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డిని ఆశ్రయిస్తే.. ‘MSP కన్నా ఎక్కువగానే వస్తోంది కదా’ అంటూ ఆయన బాధ్యతారాహిత్యంగా మాట్లాడటం శోచనీయమని దినేష్ పటేల్ విమర్శించారు. MSP అంటే మినిమం సపోర్ట్ ప్రైస్ (కనీస మద్దతు ధర) అని, మాక్సిమం సపోర్ట్ ప్రైస్ (గరిష్ట మద్దతు ధర) కాదనే కనీస అవగాహన ఎమ్మెల్యేకు ఉండాలని ఎద్దేవా చేశారు.
ఈ సమావేశంలో నూతుల శ్రీనివాస్ రెడ్డి, బిలోజీ నాయక్, బొబ్బలి వేణుగోపాల్, పద్మారెడ్డి, నరేష్, ఎర్రం సుధీర్, విజయ్ కృష్ణ,బద్దం కిషన్, ఓం సింగ్, గంగారెడ్డి, వంశీ గౌడ్, శంకర్ రెడ్డి, రాజేశ్వర్, ఆనంద్, జగన్ రెడ్డి, అన్నం గోపి, బట్టు రాఘవేందర్, మల్కాయ్ మహేందర్, మఠం పవన్, సుందర్ సింగ్ రాథోడ్, చిరంజీవి తదితరులు పాల్గొన్నారు.

