పెన్షన్ పెంపుపై కేంద్రం నిర్ణయం తీసుకోవాలి.. లేకుంటే పోరాటానికి సిద్ధం కావాలి
TUCI రాష్ట్ర నాయకుడు బి. మల్లేష్ పిలుపు
రుద్రూర్, నవంబర్ 15: (E6tv NEWS, ప్రతినిధి)
బీడీ కార్మికులకు ప్రస్తుతం అందిస్తున్న ఈపీఎఫ్ (EPF) పెన్షన్ను నెలకు రూ.9,000కు పెంచాలని తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ (TUCI) నాయకుడు బి. మల్లేష్ డిమాండ్ చేశారు. ఈపీఎఫ్ పరిధిలో ఉన్న కార్మికులు కనీసం 10 సంవత్సరాల సర్వీస్ పూర్తి చేసుకుని, 50 సంవత్సరాల వయస్సు నిండిన వారందరికీ పెరిగిన పెన్షన్ వర్తింపజేయాలని కోరారు.నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండల కేంద్రంలో బీడీ కార్మికులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఈ నెల 9వ తేదీన గుజరాత్లో జరగనున్న 240వ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ (CBT) సమావేశంలో పెన్షన్ పెంపుపై నిర్ణయం తీసుకునే అవకాశాలున్నట్లు ప్రకటనలు వెలువడుతున్నాయని తెలిపారు.
దశాబ్దాలుగా బీడీ పరిశ్రమలో పనిచేస్తూ, తమ జీవితాలను కార్మిక రంగానికే అంకితం చేసిన కార్మికులకు ప్రస్తుతం అందుతున్న పెన్షన్ జీవన అవసరాలకు ఏమాత్రం సరిపోవడం లేదన్నారు. పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలు, వైద్య ఖర్చుల నేపథ్యంలో కనీస పెన్షన్ను రూ.9,000కు పెంచడం అత్యవసరమని పేర్కొన్నారు.240వ CBT సమావేశంలో పెన్షన్ పెంపుపై సానుకూల నిర్ణయం వెలువడకపోతే బీడీ కార్మికులందరూ ఐక్యంగా ఉద్యమాలకు సిద్ధం కావాలని బి. మల్లేష్ పిలుపునిచ్చారు. కార్మికుల న్యాయమైన డిమాండ్ల సాధన కోసం సంఘటిత పోరాటం చేయాల్సిన అవసరం ఉందని ఆయన స్పష్టం చేశారు.

