కొత్తగా బైక్ లేదా కారు కొనుగోలు చేయాలనుకుంటున్న వాహనదారులకు ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా (IRDAI) తీపి కబురు అందించేందుకు సిద్ధమైంది. ఇప్పటివరకు కొత్త వాహనం కొనే సమయంలో షోరూమ్‌లో విక్రేతలు నిర్దేశించిన బీమా పాలసీనే తీసుకోవాల్సిన పరిస్థితి ఉండేది. అయితే ఈ విధానానికి స్వస్తి పలుకుతూ, వినియోగదారులకు నచ్చిన చోట, నచ్చిన ప్లాట్‌ఫామ్‌లో ఇన్సూరెన్స్ ఎంచుకునే వెసులుబాటు కల్పించేందుకు ఐఆర్‌డీఏఐ నూతన నిబంధనలను ప్రతిపాదించింది.
డిజిటల్ ఇన్సూరెన్స్‌కు ప్రాధాన్యం – క్యూఆర్ కోడ్ విధానం: కొత్త వాహన కొనుగోలుదారులకు షోరూమ్‌లోనే బీమా తీసుకునే డిజిటల్ ఆప్షన్లను స్పష్టంగా ప్రదర్శించాలని ఐఆర్‌డీఏఐ సూచించింది. ‘బీమా సుగమ్’ వంటి డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లకు నావిగేట్ అయ్యేలా షోరూమ్‌లలో ప్రత్యేక క్యూఆర్ (QR) కోడ్‌లను ఏర్పాటు చేయనున్నారు. దీనివల్ల షోరూమ్ నిర్బంధించే పాలసీ కాకుండా, ఇతర ప్లాట్‌ఫామ్‌లలో లభించే తక్కువ ప్రీమియం, మెరుగైన ఆఫర్లతో కూడిన బీమాను కస్టమర్లు తమకు నచ్చినట్లు ఎంచుకోవచ్చు.
డీలర్ల కమిషన్‌కు చెక్: మోటార్ ఇన్సూరెన్స్ విక్రయాల్లో ఖర్చులను తగ్గించేందుకు డీలర్ల కమిషన్లలో ఐఆర్‌డీఏఐ భారీ కోతలు ప్రతిపాదించింది:
- థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్: థర్డ్ పార్టీ పాలసీలపై డీలర్లకు ఎలాంటి కమిషన్ ఇవ్వకూడదని ప్రతిపాదించారు.
- ఓన్ డ్యామేజ్ కవర్లు: ఓన్ డ్యామేజ్, దాని సంబంధిత కవర్లపై గరిష్ఠంగా 5 శాతానికి మించకుండా పరిమితి విధించనున్నారు.
2022-23 నుండి 2024-25 మధ్య మోటార్ ఇన్సూరెన్స్ ప్రీమియంలు 34 శాతం పెరిగితే, డీలర్ల కమిషన్లు ఏకంగా 259 శాతం పెరగడమే ఈ కఠిన చర్యలకు ప్రధాన కారణం.
వేరే చోట ఇన్సూరెన్స్ తీసుకున్నా ‘క్యాష్‌లెస్ రిపేర్’: కస్టమర్ షోరూమ్‌లో కాకుండా బయట వేరే డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లో ఇన్సూరెన్స్ తీసుకున్నాడనే నెపంతో నెట్‌వర్క్ గేరేజీలు/డీలర్లు క్యాష్‌లెస్ రిపేర్ సదుపాయాన్ని తిరస్కరించడానికి వీల్లేదని ఐఆర్‌డీఏఐ స్పష్టం చేసింది. తుది నిబంధనల ప్రకారమే ఈ సేవలు లభిస్తాయి.

