Breaking News

ఫిర్యాదులు ఇచ్చినా ఫలితం శూన్యం.. ప్రభుత్వ భూములకు రక్షణేదీ?

ప్రజాపాలనలో దరఖాస్తులు ఇచ్చినా పట్టించుకోని అధికారులు!

కుందాపూర్‌లో చెరువులు, కుంటలు, గుట్టల భూములు కబ్జాకు గురయ్యాయని ఆరోపణలు

ప్రభుత్వ భూములను కాపాడాలని సర్పంచ్ సాయిలు డిమాండ్

నవంబర్ 2న ఫిర్యాదు చేసినా చర్యలు లేవని ఆవేదన

ఇంటి నంబర్ కోసం పలుమార్లు దరఖాస్తు చేసినా న్యాయం జరగలేదంటున్న అశోక్

ప్రజావాణికి ప్రధాన అధికారుల గైర్హాజరుపై విమర్శలు

రుద్రూర్, నవంబర్ 10 (E6 టీవీ న్యూస్):

ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రజాపాలన కార్యక్రమం కేవలం దరఖాస్తుల స్వీకరణకే పరిమితమవుతోందా? ఫిర్యాదులు ఇచ్చినా చర్యలు తీసుకోకపోతే ప్రజలకు న్యాయం జరిగేదెలా? అంటూ రుద్రూర్ మండల ప్రజలు ప్రశ్నిస్తున్నారు. నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండలం కుందాపూర్ గ్రామంలో ప్రభుత్వ భూములు ఆక్రమణకు గురవుతున్నాయని ఫిర్యాదు చేసినప్పటికీ సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని గ్రామ సర్పంచ్ సాయిలు ఆరోపించారు.

ప్రభుత్వ భూముల కబ్జాపై చర్యలేవీ?

కుందాపూర్ గ్రామ పరిధిలోని విలువైన ప్రభుత్వ భూములను కొంతమంది వ్యక్తులు ఆక్రమించుకున్నారని సర్పంచ్ సాయిలు ఆరోపించారు. ఈ విషయమై నవంబర్ 2, 2026న ప్రజాపాలన కార్యక్రమంలో ఫిర్యాదు చేసినప్పటికీ ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం రుద్రూర్ మండల సమీకృత కార్యాలయ భవనంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో మరోసారి ఫిర్యాదు అందజేసినట్లు తెలిపారు.

చెరువులు, కుంటలు, గుట్టలు సైతం ఆక్రమణలోనేనా?

కుందాపూర్ గ్రామ పరిధిలోని సర్వే నంబర్ 219లో ఊర చెరువు, సర్వే నంబర్ 103లో పచ్చల కుంట, సర్వే నంబర్లు 141, 142, 143లో గైని గుట్ట, సర్వే నంబర్ 309లో సప్తగడ్డ ప్రాంతాలకు సంబంధించిన ప్రభుత్వ భూములు ఆక్రమణకు గురయ్యాయని సర్పంచ్ ఆరోపించారు. ఏళ్ల తరబడి ఆక్రమణలు కొనసాగుతున్నా సంబంధిత శాఖల అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. వెంటనే భూములపై సమగ్ర సర్వే నిర్వహించి, ఆక్రమణలు ఉన్నట్లు నిర్ధారణ అయితే వాటిని తొలగించాలని డిమాండ్ చేశారు.

ప్రజాపాలనలో ఫిర్యాదులకు విలువ లేదా?

ప్రజల సమస్యల పరిష్కారానికి నిర్వహిస్తున్న ప్రజాపాలన కార్యక్రమంలో ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసినా ఫలితం లేకపోవడం విచారకరమని సాయిలు పేర్కొన్నారు. ప్రభుత్వ భూములను పరిరక్షించాల్సిన బాధ్యత అధికారులపై ఉందని, ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి ఆక్రమణల ఆరోపణలపై విచారణ జరిపించాలని కోరారు.

ఇంటి నంబర్ కోసం తిరుగుతున్నా న్యాయం జరగడం లేదు!

మరోవైపు తాను నిర్మించుకున్న ఇంటికి ఇంటి నంబర్ కేటాయించాలని పలుమార్లు ప్రజాపాలన కార్యక్రమంలో దరఖాస్తులు చేసినా అధికారులు స్పందించడం లేదని అశోక్ ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా పంచాయతీ అధికారి (డీపీఓ), జిల్లా కలెక్టర్‌కు సైతం ఫిర్యాదు చేసినప్పటికీ సమస్య పరిష్కారం కాలేదని తెలిపారు. ఈసారైనా తన దరఖాస్తును పరిశీలించి న్యాయం చేయాలని కోరారు.

ప్రజావాణికి అందినవి రెండు ఫిర్యాదులే!

సోమవారం రుద్రూర్ మండలంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి మొత్తం రెండు ఫిర్యాదులు అందినట్లు అధికారులు వెల్లడించారు. పంచాయతీరాజ్ శాఖకు సంబంధించి ఒకటి, ఇరిగేషన్ శాఖకు సంబంధించి మరొక ఫిర్యాదు అందినట్లు పేర్కొన్నారు. సంబంధిత అధికారులు ఫిర్యాదులను పరిశీలించి పరిష్కరించాలని సూచించినట్లు తెలిపారు.

ప్రధాన అధికారులు లేకుండానే ప్రజావాణి?

ప్రజాపాలన కార్యక్రమానికి వివిధ శాఖల అధికారులు హాజరై ప్రజల సమస్యలను పరిష్కరించాల్సి ఉండగా, కొంతమంది అధికారులు మాత్రమే హాజరవుతున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. సుమారు 16 నుంచి 21 శాఖలకు చెందిన అధికారులు అందుబాటులో ఉండాల్సి ఉంటుందని పలువురు పేర్కొంటున్నారు. అయితే ప్రధాన అధికారులు హాజరు కాకపోవడంతో ప్రజలు తమ సమస్యలను ఎవరికి చెప్పుకోవాలని ప్రశ్నిస్తున్నారు.

ఈ విషయమై కార్యాలయ సూపరింటెండెంట్‌ను వివరణ కోరగా, 16 శాఖలకు చెందిన అధికారులు హాజరు కావాల్సి ఉంటుందని తెలిపారు. కొంతమంది సెలవులో ఉన్నారని, పండుగ నేపథ్యంలో మరికొందరు హాజరు కాలేదని వివరించారు.

దరఖాస్తుల స్వీకరణేనా.. సమస్యల పరిష్కారం లేదా?

ప్రజాపాలన కార్యక్రమంలో ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించడమే కాకుండా వాటికి సకాలంలో పరిష్కారం చూపాల్సిన అవసరం ఉందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. ప్రభుత్వ భూముల ఆక్రమణలపై వచ్చిన ఫిర్యాదులను రెవెన్యూ, ఇరిగేషన్ శాఖల అధికారులు సంయుక్తంగా పరిశీలించాలని కోరుతున్నారు.

ప్రజలు పదేపదే ఫిర్యాదులు చేస్తున్నా పరిష్కారం లభించకపోతే ప్రజాపాలన కార్యక్రమంపై నమ్మకం ఎలా పెరుగుతుందని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్, సంబంధిత శాఖల ఉన్నతాధికారులు స్పందించి ప్రభుత్వ భూములను పరిరక్షించడంతోపాటు పెండింగ్ ఫిర్యాదులను పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *