Breaking News

పదేళ్లుగా రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా.. తీరని భూ సమస్య!

32 గుంటల భూమి ఆన్‌లైన్‌లో మాయం.. న్యాయం చేయాలని ప్రజావాణిలో బాధితురాలి కుమారుడి ఫిర్యాదు

పాత పహాణీలు, రిజిస్ట్రేషన్ పత్రాలు ఉన్నా పట్టాదారు పాస్‌బుక్‌లో నమోదు కాని భూమి

కోటగిరి, నవంబర్ 17: (E6tv NEWS).

తమకు చట్టబద్ధంగా సంక్రమించిన భూమిని రెవెన్యూ రికార్డుల్లో పూర్తిస్థాయిలో నమోదు చేయాలని కోరుతూ ఓ బాధిత కుటుంబం గత పదేళ్లుగా అధికారుల చుట్టూ తిరుగుతున్నా సమస్య పరిష్కారం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేసింది. కోటగిరి మండల కేంద్రంలో నవంబర్ 16న నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో బాధితురాలు వడ్డే వీరమణి కుమారుడు అధికారులకు ఫిర్యాదు చేశారు. కోటగిరి గ్రామ శివారులోని 132 సర్వే నంబర్‌లో తమకు చెందిన మొత్తం ఎకరం 15 గుంటల భూమిలో 32 గుంటలు ఆన్‌లైన్ రెవెన్యూ రికార్డుల్లో నమోదు కాలేదని, వెంటనే సరిచేసి పట్టాదారు పాస్‌బుక్ అందించాలని కోరారు.

ఎకరం 15 గుంటలు కొనుగోలు.. ఆన్‌లైన్‌లో 23 గుంటలే నమోదు!

బాధితురాలు వడ్డే వీరమణి తండ్రి లింగయ్య పేరుతో కోటగిరి గ్రామ శివారులోని 132 సర్వే నంబర్‌లో మొత్తం ఎకరం 15 గుంటల భూమి ఉన్నట్లు పాత పహాణీలు, పాస్‌బుక్‌లలో నమోదై ఉందని కుటుంబ సభ్యులు తెలిపారు. 2001లో గంజి రాములు అనే వ్యక్తి వద్ద భూమిని కొనుగోలు చేసినట్లు రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు కూడా ఉన్నాయని పేర్కొన్నారు. అన్నదమ్ములు కలిసి భూమిని కొనుగోలు చేసి వీరమణి పేరుపై రిజిస్ట్రేషన్ చేయించారని వివరించారు. ధరణి పోర్టల్ అమల్లోకి వచ్చిన తర్వాత రెవెన్యూ రికార్డుల్లో భూమి వివరాలు మారిపోయాయని, మొత్తం ఎకరం 15 గుంటలకు బదులుగా కేవలం 23 గుంటలు మాత్రమే ఆన్‌లైన్‌లో నమోదయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. మిగిలిన 32 గుంటల భూమి పట్టాదారు పాస్‌బుక్‌లో నమోదు కాకపోవడంతో కుటుంబం ఇబ్బందులు ఎదుర్కొంటోందని తెలిపారు.

అధికారులు పలుమార్లు సర్వే చేసినా పరిష్కారం కరువు!

ఈ సమస్యపై గతంలో పలుమార్లు తహసీల్దార్ కార్యాలయాన్ని సంప్రదించినప్పటికీ సరైన పరిష్కారం లభించలేదని బాధిత కుటుంబం పేర్కొంది. గ్రామస్థాయి రెవెన్యూ అధికారులు, వీఆర్ఏలు, ఆర్ఐ ఇతర సిబ్బంది పలుమార్లు భూమిని సర్వే చేసి, వివరాలు సేకరించి, ఫొటోలు కూడా తీసుకున్నారని తెలిపింది. అయినప్పటికీ ఇప్పటివరకు మిగిలిన భూమి ఆన్‌లైన్ రికార్డుల్లో నమోదు కాలేదని ఆవేదన వ్యక్తం చేసింది.గతంలో నిజామాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణిలో కూడా ఫిర్యాదు చేయగా, భూమి వివరాలు పరిశీలించి న్యాయం చేస్తామని అప్పటి కలెక్టర్ హామీ ఇచ్చినట్లు గుర్తుచేశారు.వీరమణికి వివాహం అనంతరం పేరు మారిందని, ప్రస్తుతం గొర్రె గౌతమణి పేరుతో కూడా గుర్తింపు ఉందని కుటుంబ సభ్యులు వివరించారు. విద్యార్హత సర్టిఫికెట్లలో వడ్డే వీరమణి, తండ్రి లింగయ్య, గ్రామం కోటగిరి అని ఉండగా, వివాహ పత్రికలో వడ్డే వీరమణి అలియాస్ గౌతమణి అని పేర్కొన్నట్లు తెలిపారు. ఈ పత్రాలను కూడా అధికారులకు సమర్పించామని చెప్పారు.

కలెక్టర్ జోక్యం చేసుకుని న్యాయం చేయాలి

గత జూన్ నెలలో నిజామాబాద్ జిల్లా కలెక్టర్‌కు మరోసారి సమస్యను వివరించగా, సంబంధిత ధరణి అధికారులను పిలిపించి వివరాలు తెలుసుకున్నారని బాధిత కుటుంబం తెలిపింది. ఆ సమయంలో భూమి వివరాలు ఎక్సెస్‌లో కనిపిస్తున్నాయని, కోటగిరి తహసీల్దార్ కార్యాలయం నుంచి అవసరమైన నివేదిక పంపిస్తే కొత్త పట్టాదారు పాస్‌బుక్ జారీకి అవకాశం ఉంటుందని అధికారులు తెలిపినట్లు వెల్లడించారు. నెల లేదా రెండు నెలల్లో సమస్య పరిష్కారమవుతుందని చెప్పినా ఇప్పటివరకు కార్యరూపం దాల్చలేదని వాపోయారు.ప్రస్తుతం బాధితురాలి ఆరోగ్య పరిస్థితి కూడా బాగాలేదని, భర్త, తండ్రి కూడా మరణించడంతో కుటుంబానికి మరింత ఇబ్బందులు ఎదురవుతున్నాయని పేర్కొన్నారు. పదేళ్లుగా కార్యాలయాల చుట్టూ తిరుగుతున్న తమకు ఇప్పటికైనా న్యాయం చేయాలని కోరారు.నవంబర్ 16న కోటగిరిలో నిర్వహించిన ప్రజావాణిలో మరోసారి దరఖాస్తు చేసుకోగా, సమస్యను పరిష్కరిస్తామని అధికారులు హామీ ఇచ్చినట్లు బాధిత కుటుంబం తెలిపింది. ఇప్పటికైనా సంబంధిత రెవెన్యూ అధికారులు పాత పహాణీలు, రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు, సర్వే నివేదికలను పరిశీలించి మొత్తం ఎకరం 15 గుంటల భూమిని రికార్డుల్లో నమోదు చేసి పట్టాదారు పాస్‌బుక్ అందించాలని బాధితురాలు ప్రభుత్వాన్ని, జిల్లా కలెక్టర్‌ను వేడుకుంటోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *