Breaking News

ఘోర రోడ్డు ప్రమాదం.. ఆటో బోల్తా పడి మహిళ మృతి!

మరో ముగ్గురికి తీవ్ర గాయాలు.. ముగ్గురి పరిస్థితి విషమం

మెట్‌పల్లి, నవంబర్ 11 (E6tv న్యూస్).

జగిత్యాల జిల్లా మెట్‌పల్లి పట్టణంలోని బ్లూ ఫాక్స్ బార్ సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. అకస్మాత్తుగా రోడ్డుపైకి వచ్చిన కుక్కను తప్పించబోయే క్రమంలో ప్రయాణికులతో వెళ్తున్న ఆటో అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో బండలింగాపూర్ గ్రామానికి చెందిన నాగెల్లి లక్ష్మవ్వ (60) మృతి చెందగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.

ప్రమాదంలో ఆటో డ్రైవర్ ముద్దం లింగం (53), ముద్దుల చిన్నరాజు (63), కోరెం మల్లు (50) గాయపడినట్లు సమాచారం. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే స్పందించి క్షతగాత్రులను మెట్‌పల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.గాయపడిన ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపినట్లు సమాచారం. మృతురాలితో పాటు క్షతగాత్రులంతా బండలింగాపూర్ గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు.

ఈ ప్రమాదంతో బండలింగాపూర్ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేపట్టారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *