Breaking News

నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల రవాణా శాఖ అధికారులతో జాయింట్ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ సమీక్ష

పెండింగ్ దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలి – ఆదాయ వసూళ్లపై ప్రత్యేక దృష్టి సారించాలి

నిజామాబాద్, నవంబర్ 12:(E6tv NEWS). జాయింట్ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ (ఐటీ, విజిలెన్స్ అండ్ రోడ్ సేఫ్టీ) ఎం. చంద్రశేఖర్ గౌడ్ నిజామాబాద్‌లో పర్యటించి, నిజామాబాద్ ఉప రవాణా కమిషనర్ కార్యాలయాన్ని తనిఖీ చేశారు. అనంతరం నిజామాబాద్, కామారెడ్డి ఉమ్మడి జిల్లాల రవాణా శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి శాఖాపరమైన పనితీరుపై సమగ్రంగా సమీక్షించారు.

ఈ సందర్భంగా కార్యాలయంలోని వివిధ విభాగాలను పరిశీలించిన ఆయన, కౌంటర్ వారీగా, క్లర్క్ వారీగా జరుగుతున్న లావాదేవీలను తనిఖీ చేశారు. లెర్నర్ లైసెన్స్‌లు, డ్రైవింగ్ లైసెన్స్‌లు, వాహనాల ఫిట్‌నెస్, రిజిస్ట్రేషన్ రెన్యువల్ తదితర సేవలను ప్రజలకు ఎలాంటి జాప్యం లేకుండా అందించాలని అధికారులకు సూచించారు.వాహన్, సారథి, CFST పోర్టళ్లలో పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను నిర్దేశిత గడువులోగా పరిష్కరించాలని ఆదేశించారు. స్మార్ట్ కార్డుల ప్రింటింగ్, డిస్పాచ్ ప్రక్రియను వేగవంతం చేసి లబ్ధిదారులకు సకాలంలో అందించాలని స్పష్టం చేశారు.ఇన్‌స్పెక్టర్ వారీగా ఆదాయ వసూళ్లను సమీక్షిస్తూ ప్రభుత్వ ఆదాయ లక్ష్యాలను సాధించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు. పన్నులు చెల్లించని వాహనాలపై ప్రత్యేక ఎన్‌ఫోర్స్‌మెంట్ డ్రైవ్‌లు నిర్వహించాలని, అధిక లోడుతో ప్రయాణించే వాహనాలపై తనిఖీలు ముమ్మరం చేసి నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

రవాణా శాఖ కార్యాలయాల్లో మధ్యవర్తులు, అనధికార వ్యక్తుల ప్రవేశాన్ని పూర్తిగా అరికట్టాలని, ప్రజలకు అందించే సేవల్లో పారదర్శకత, క్రమశిక్షణ, జవాబుదారీతనం పాటించాలని సూచించారు.పర్యావరణ పరిరక్షణలో భాగంగా జాయింట్ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ ఎం. చంద్రశేఖర్ గౌడ్‌తో పాటు ఇతర అధికారులు కార్యాలయ ప్రాంగణంలో మొక్కలు నాటారు. పచ్చదనం పెంపొందించేందుకు ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు.ప్రజలకు రవాణా శాఖ సేవలను మరింత వేగంగా, పారదర్శకంగా అందించడంతో పాటు రహదారి భద్రత, పెండింగ్ దరఖాస్తుల పరిష్కారం, ప్రభుత్వ ఆదాయ వసూళ్లు, ఎన్‌ఫోర్స్‌మెంట్ కార్యకలాపాలపై ప్రత్యేక దృష్టి సారించాలని రెండు జిల్లాల అధికారులకు దిశానిర్దేశం చేశారు.

ఈ సమావేశంలో ఉప రవాణా కమిషనర్ జి. దుర్గ ప్రమీల, DTO రమేష్ రాథోడ్, RTO టి. సంతోష్ కుమార్, కామారెడ్డి RTO, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ప్రహ్లాద్, MVIs అశ్వంత్ కుమార్, రాహుల్, ప్రదీప్, AMVI రోహిత్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *