Breaking News

హిందూ–ముస్లిం భాయ్ భాయ్” నినాదాలతో మారుమోగిన భైంసా

ప్రశాంతంగా ముగిసిన గణేష్ నిమజ్జన శోభాయాత్ర

భైంసా, సెప్టెంబర్ 22:(E6tv NEWS: ప్రతినిధి).
భైంసా పట్టణంలో గణేష్ నిమజ్జన శోభాయాత్ర మంగళవారం భక్తిశ్రద్ధలు, ఉత్సాహం మధ్య ప్రశాంతంగా ముగిసింది. శోభాయాత్ర సందర్భంగా “హిందూ–ముస్లిం భాయ్ భాయ్” నినాదాలు మారుమోగగా, ప్రజలు మతసామరస్యం, సోదరభావాన్ని చాటుకున్నారు.

శోభాయాత్రకు పెద్ద సంఖ్యలో భక్తులు, ప్రజలు తరలిరావడంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీస్ శాఖ పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసింది. జిల్లా ఎస్పీ డా. జి. జానకి షర్మిల, ఐపీఎస్‌ భైంసా పట్టణంలోని శోభాయాత్ర మార్గాలను స్వయంగా పరిశీలించి భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించారు.శోభాయాత్ర మార్గంలో పోలీసుల విధులు, ట్రాఫిక్ నియంత్రణ, ప్రజల రాకపోకలను ఎస్పీ పరిశీలించి అధికారులు, సిబ్బందికి పలు సూచనలు చేశారు. ప్రధాన కూడళ్లు, శోభాయాత్ర మార్గాలతో పాటు నిమజ్జన ఘాట్‌ వద్ద ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు.

గణేష్ మండపాల నిర్వాహకులు, భక్తులకు ఇబ్బందులు కలగకుండా పోలీసులు ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరిస్తూ విధులు నిర్వహించారు. ప్రజలు, మండపాల నిర్వాహకులు పోలీసులకు సహకరించి నిబంధనలు పాటించడంతో శోభాయాత్ర సజావుగా కొనసాగింది.భైంసాలో మతసామరస్యం, సోదరభావం వెల్లివిరిసేలా ప్రజలు పరస్పరం సహకరించుకోవడం అభినందనీయమని పోలీస్ శాఖ పేర్కొంది. నిమజ్జన బందోబస్తులో విధులు నిర్వహించిన పోలీసు అధికారులు, సిబ్బందిని ఎస్పీ అభినందించారు.

నిమజ్జన శోభాయాత్ర ప్రశాంతంగా జరిగేందుకు సహకరించిన భైంసా ప్రజలకు, గణేష్ మండపాల నిర్వాహకులకు పోలీస్ శాఖ కృతజ్ఞతలు తెలిపింది.ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ డా. జి. జానకి షర్మిల, ఐపీఎస్‌, వికారాబాద్ అడిషనల్ ఎస్పీ రాజేష్ మీనా, ఐపీఎస్‌, భైంసా ఏఎస్పీ సాయి కిరణ్, ఐపీఎస్‌తో పాటు ఇన్స్పెక్టర్లు, ఎస్సైలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

– విలేకరి: రిజ్వాన్ అహ్మద్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *