Breaking News

గ్రామ అభివృద్ధికి నిధులు మంజూరు చేయండి!

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి అంబం (ఆర్) గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్ వినతి

రుద్రూర్ నవంబర్ 13 (E6tv న్యూస్): నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండలం అంబం (ఆర్) గ్రామ పంచాయతీ అభివృద్ధికి అవసరమైన నిధులు మంజూరు చేయాలని కోరుతూ గ్రామ సర్పంచ్ కుర్లెపు గంగాధర్, ఉప సర్పంచ్ రేపల్లి సాయి ప్రసాద్ కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డిని శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిసి వినతిపత్రం అందజేశారు. గ్రామంలోని సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. అంబం (ఆర్) గ్రామంలో సుమారు 3,000 మంది జనాభా నివసిస్తున్నారని, ఏళ్ల తరబడి సరైన సీసీ రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వివరించారు.మురుగునీరు నిలిచిపోయి దోమల బెడద పెరుగుతోందని, దీంతో గ్రామ ప్రజలు విషజ్వరాల బారిన పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అదేవిధంగా అంబం (ఆర్) గ్రామం నుంచి రుద్రూర్ మండల కేంద్రానికి వెళ్లే సుమారు 4.5 కిలోమీటర్ల ప్రధాన రహదారి పూర్తిగా దెబ్బతిని అధ్వాన్నంగా మారిందని తెలిపారు.

గ్రామ ప్రజల సమస్యలను దృష్టిలో ఉంచుకొని గ్రామంలో సీసీ రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ నిర్మాణానికి, రుద్రూర్ వెళ్లే ప్రధాన రహదారి మరమ్మతులకు అవసరమైన నిధులు మంజూరు చేసి గ్రామ అభివృద్ధికి సహకరించాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని కోరారు.ఈ కార్యక్రమంలో గ్రామ వార్డు సభ్యులు బడే రాము, కమ్మరి లక్ష్మణ్, బి.ఏ. పోశెట్టి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *