Breaking News

మీ ఓటు తొలగించబడిందా?’ఫారం 7′.. అప్లై చేసే విధానం ఇదీ!

భారత ప్రజాస్వామ్య ప్రక్రియలో స్వచ్ఛమైన, పారదర్శకమైన ఓటర్ల జాబితా అత్యంత కీలకమైనది. ఈ క్రమంలో ఓటర్ల జాబితాలోని అనర్హులు, చనిపోయినవారు లేదా చిరునామా మారిన వారి పేర్లను తొలగించడానికి భారత ఎన్నికల సంఘం (ECI) ప్రత్యేకంగా ‘ఫారం 7’ (Form 7) ను అందుబాటులోకి తెచ్చింది.

ఫారం 7 అంటే ఏమిటి?.. ఎప్పుడు ఉపయోగిస్తారు? రిజిస్ట్రేషన్ ఆఫ్ ఎలక్టర్స్ రూల్స్, 1960 ప్రకారం రూపొందించిన ఫారం 7ను కింది ప్రత్యేక సందర్భాలలో ఉపయోగిస్తారు:

  • ఓటరు మరణించినప్పుడు.
  • ఓటరు శాశ్వతంగా వేరే ప్రాంతానికి నివాసం మార్చినప్పుడు.
  • ఒకే వ్యక్తికి రెండు వేర్వేరు చోట్ల ఓటు హక్కు నమోదు అయి ఉన్నప్పుడు.
  • నిర్ణీత వయసు (18 ఏళ్లు) నిండకుండానే ఓటరుగా నమోదైనప్పుడు లేదా భారత పౌరుడు కానప్పుడు.
  • ఒక వ్యక్తి తన పేరును స్వయంగా ఓటర్ల జాబితా నుంచి తొలగించుకోవాలనుకున్నప్పుడు.

ఎవరు, ఎలా దరఖాస్తు చేయాలి? అదే నియోజకవర్గంలోని ఓటర్ల జాబితాలో నమోదైన ఏ ఓటరైనా మరో వ్యక్తి పేరుపై అభ్యంతరం తెలుపుతూ ఫారం 7 సమర్పించవచ్చు. ఓటర్ సర్వీస్ పోర్టల్ ద్వారా ఆన్‌లైన్‌లో గానీ, బూత్ లెవల్ ఆఫీసర్ (BLO) ద్వారా ఆఫ్‌లైన్‌లో గానీ దీనిని అందజేయవచ్చు.

విచారణ ప్రక్రియ: ఫారం 7 వచ్చిన తర్వాత ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ (ERO) సంబంధిత వ్యక్తికి నోటీసు పంపి, బీఎల్ఓ ద్వారా క్షేత్రస్థాయి విచారణ జరిపిస్తారు. నివేదికల ఆధారంగా నిజమైన కారణాలు ఉన్నాయని నిర్ధారణ అయితేనే ఓటరు పేరును జాబితా నుంచి తొలగిస్తారు.

తప్పుడు ఫిర్యాదులు చేస్తే ఏడాది జైలు శిక్ష: ఫారం 7ను దుర్వినియోగం చేస్తూ రాజకీయ లేదా వ్యక్తిగత కక్షలతో తప్పుడు సమాచారంతో ఫిర్యాదు చేస్తే ప్రజా ప్రాతినిధ్య చట్టం, 1950 లోని సెక్షన్ 31 ప్రకారం గరిష్ఠంగా ఏడాది వరకు జైలు శిక్ష, జరిమానా లేదా రెండూ విధించే అవకాశం ఉంది. కాబట్టి పౌరులు ఈ అవకాశాన్ని బాధ్యతాయుతంగా ఉపయోగించుకోవాలని ఎన్నికల సంఘం కోరింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *