తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) దర్యాప్తును వేగవంతం చేసింది. ఈ హత్య కేసుకు సంబంధించి మనీలాండరింగ్, హవాలా కోణాల్లో ఆరా తీస్తున్న ఈడీ అధికారులు.. ప్రధాన నిందితుల్లో ఒకరైన సునీల్ యాదవ్‌ను హైదరాబాద్‌లోని ప్రాంతీయ కార్యాలయంలో రెండో రోజు కూడా సుదీర్ఘంగా విచారిస్తున్నారు.
తొలిరోజు 9 గంటల పాటు ప్రశ్నించిన అధికారులు: గురువారం మొదటి రోజు విచారణలో భాగంగా ఈడీ అధికారులు సునీల్ యాదవ్‌ను సుమారు 9 గంటల పాటు తీవ్రంగా ప్రశ్నించారు. వివేకా హత్యకు దారితీసిన పరిస్థితులతో పాటు, ఆ సమయంలో సాగిన అనుమానాస్పద ఆర్థిక లావాదేవీల చిట్టాను ఆయన ముందుంచి కూపీ లాగారు. ఈ హత్య వెనుక రూ. కోట్లలో హవాలా, మనీలాండరింగ్ లావాదేవీలు జరిగినట్లు బలమైన ఆధారాలు, అనుమానాలు ఉన్న నేపథ్యంలో ఈడీ రంగంలోకి దిగి ప్రత్యేక విచారణ చేపడుతోంది.
ఈ విచారణలో సునీల్ యాదవ్ ఇచ్చే సమాచారం ఆధారంగా కేసులో మరికొందరికి ఈడీ నోటీసులు జారీ చేసే అవకాశం ఉంది.

