ఉత్తర ఆంధ్రప్రదేశ్ తీరానికి సమీపిస్తున్న వాయుగుండం (దీప్ డిప్రెషన్) ప్రభావంతో రాబోయే 24 గంటల్లో తెలంగాణవ్యాప్తంగా వర్షాలు తీవ్రతరం కానున్నాయి. ముఖ్యంగా తూర్పు తెలంగాణ జిల్లాలపై దీని ప్రభావం ఎక్కువగా ఉండనుంది. ములుగు, భద్రాద్రి-కొత్తగూడెం జిల్లాల్లో ఉదయం నుంచే ఈదురుగాలులతో కూడిన అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశముంది. అలాగే ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జయశంకర్ భూపాలపల్లి, పెద్దపల్లి, మంచిర్యాల, కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాల్లో కూడా అక్కడక్కడ మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.
మరోవైపు సూర్యాపేట, జనగామ, జగిత్యాల, రాజన్న-సిరిసిల్ల, కరీంనగర్ జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుండి భారీ వర్షాలు పడొచ్చని, రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో చిరుజల్లుల నుండి మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది. రాత్రి సమయంలో భారీ వర్షాన్ని చూసిన హైదరాబాద్ నగరంలో.. మధ్యాహ్నం నుండి మరుసటి రోజు ఉదయం వరకు రెండు మూడు విడతలుగా మోస్తరు వర్షపాతం నమోదు కావచ్చని, కొన్ని ప్రాంతాల్లో రాత్రంతా విడవకుండా వర్షం కురిసే సూచనలు ఉన్నాయని అధికారులు తెలిపారు.

