Breaking News

కోరుట్ల మహామేరు సంఘం స్థలంలో అక్రమ నిర్మాణం!

నిర్మాణం ఆపినట్లు కలెక్టర్‌కు తప్పుడు సమాచారం ఇచ్చారా?

మున్సిపల్ అధికారుల తీరుపై సంఘ సభ్యుల ఆగ్రహం

కోరుట్ల, నవంబర్ 11 (E6tvన్యూస్).

జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని సుభాష్ రోడ్డులో ఉన్న మహామేరు సంఘం స్థలంలో అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయంటూ సంఘ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సంఘానికి చెందిన రిజిస్ట్రేషన్ నంబర్ 3760/95, ఇంటి నంబర్ 5-1-12 పరిధిలోని స్థలంలో సంఘ సభ్యులకు తెలియకుండా సుమారు 50 గజాల స్థలాన్ని విక్రయించారని ఆరోపిస్తున్నారు.

ఈ వ్యవహారంపై 2022లోనే ఆర్జేడీ, జిల్లా కలెక్టర్, ఆర్డీఓ, కోరుట్ల మున్సిపల్ కమిషనర్‌కు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసినట్లు సంఘ సభ్యులు తెలిపారు.సంఘ స్థలంలో మున్సిపల్ అనుమతులు, లింక్ డాక్యుమెంట్లు లేకుండానే అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారని ఆరోపిస్తూ 2026 సెప్టెంబర్ 28న ప్రజావాణిలో జిల్లా కలెక్టర్‌కు మరోసారి ఫిర్యాదు చేశారు.

ఈ ఫిర్యాదుపై కోరుట్ల మున్సిపల్ కమిషనర్ ఎల్ఆర్ నంబర్ GI/132/2026, తేదీ 29-10-2026తో సమాధానం ఇచ్చినట్లు ఫిర్యాదుదారుడు తెలిపారు. నిర్మాణ పనులు నిలిపివేసినట్లు అధికారులు సమాచారం ఇచ్చినప్పటికీ, క్షేత్రస్థాయిలో మాత్రం గ్రౌండ్ ఫ్లోర్‌తో పాటు మొదటి అంతస్తు స్లాబ్ నిర్మాణం కూడా పూర్తయిందని ఆయన ఆరోపించారు.నిర్మాణం నిలిపివేసినట్లు జిల్లా కలెక్టర్‌కు మున్సిపల్ అధికారులు తప్పుడు సమాచారం అందించారని ఫిర్యాదుదారుడు ఆరోపిస్తున్నారు. ఈ విషయంపై నవంబర్ 7న మరోసారి కోరుట్ల మున్సిపల్ కమిషనర్‌కు ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు.

ఇప్పటికైనా జిల్లా కలెక్టర్, కోరుట్ల సబ్ కలెక్టర్, మున్సిపల్ కమిషనర్ స్పందించి సంఘ స్థలంపై సమగ్ర విచారణ జరిపించాలని మహామేరు సంఘ సభ్యులు కోరుతున్నారు. అక్రమ నిర్మాణాలపై చట్టపరమైన చర్యలు తీసుకుని, సంఘానికి చెందిన స్థలాన్ని పరిరక్షించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.భవిష్యత్ తరాలకు ఉపయోగపడాల్సిన సంఘ స్థలాన్ని కాపాడాలని, ఇలాంటి ఆక్రమణలు పునరావృతం కాకుండా అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని మహామేరు సంఘ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *