భైంసా, సెప్టెంబర్ 21:(E6tv NEWS: ప్రతినిధి).
పట్టణంలో రేపు నిర్వహించనున్న గణేష్ నిమజ్జన కార్యక్రమానికి సంబంధించి చేపట్టిన భద్రతా ఏర్పాట్లను జిల్లా ఎస్పీ డా. జి. జానకి షర్మిల, ఐపీఎస్ సోమవారం పరిశీలించారు. గణేష్ విగ్రహాల నిమజ్జనం కోసం ఏర్పాటు చేసిన గడ్డెన్న వాగు నిమజ్జన ప్రదేశాన్ని ఆమె పరిశీలించారు.
నిమజ్జన కార్యక్రమంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన భద్రతా చర్యలు చేపట్టాలని పోలీసు అధికారులకు ఎస్పీ సూచించారు. నిమజ్జన శోభాయాత్ర ప్రశాంతంగా, సజావుగా జరిగేలా ట్రాఫిక్ నియంత్రణ, బందోబస్తు, రూట్ నిర్వహణ తదితర అంశాలపై అధికారులతో సమీక్షించారు.నిమజ్జన సమయంలో పోలీసు అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండి సమన్వయంతో విధులు నిర్వహించాలని ఎస్పీ సూచించారు. ప్రజలు, గణేష్ మండపాల నిర్వాహకులు పోలీసులకు సహకరించి నిమజ్జన కార్యక్రమాన్ని ప్రశాంతంగా నిర్వహించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో భైంసా ఏఎస్పీ సాయి కిరణ్, ఐపీఎస్, సీఐలు ప్రవీణ్, సాయి కుమార్ తదితర పోలీసు అధికారులు పాల్గొన్నారు.

