Breaking News

ప్రజావాణిలో ఫిర్యాదుదారుల సమస్యలు విన్న ఎస్పీ

నిర్మల్, సెప్టెంబర్ 21:(E6tv NEWS: ప్రతినిధి).

జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా ఎస్పీ డా. జి. జానకి షర్మిల, ఐపీఎస్ జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల ఫిర్యాదులు, వినతులను స్వీకరించారు. ఫిర్యాదుదారులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

ప్రజలు తెలిపిన సమస్యలను క్షుణ్ణంగా విన్న ఎస్పీ, సంబంధిత పోలీస్‌స్టేషన్ అధికారులతో మాట్లాడి ప్రతి ఫిర్యాదుపై తక్షణమే స్పందించాలని ఆదేశించారు. ఫిర్యాదులను చట్టపరంగా పరిశీలించి, బాధితులకు సకాలంలో న్యాయం అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.ప్రజావాణిలో స్వీకరించిన ప్రతి ఫిర్యాదును బాధ్యతతో పరిష్కరించాలని, తీసుకున్న చర్యలను ఎప్పటికప్పుడు సమీక్షించాలని అధికారులను ఆదేశించారు. ఫిర్యాదుల పరిష్కారంలో అనవసర జాప్యానికి తావులేకుండా, బాధితులతో మర్యాదపూర్వకంగా వ్యవహరిస్తూ వారికి అవసరమైన సహకారం అందించాలని సూచించారు.

ప్రజలు తమ సమస్యలను నేరుగా పోలీసు శాఖ దృష్టికి తీసుకువచ్చేందుకు ప్రజావాణి కార్యక్రమం ఎంతగానో ఉపయోగపడుతుందని ఎస్పీ తెలిపారు. ప్రజలకు పోలీసు సేవలను మరింత చేరువ చేయడంతో పాటు, పారదర్శకంగా, బాధ్యతాయుతంగా సేవలందించడం ద్వారా పోలీసు శాఖపై ప్రజల నమ్మకాన్ని మరింత బలోపేతం చేయడమే లక్ష్యమని డా. జి. జానకి షర్మిల పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *