Breaking News

మౌంట్ తరంగ్-II అధిరోహించిన కామారెడ్డి గిరిజన సంక్షేమ కళాశాల విద్యార్థి

కామారెడ్డి, సెప్టెంబర్ 26:(E6tv NEWS: ప్రతినిధి)

హిమాచల్ ప్రదేశ్‌లోని లాహౌల్–స్పితి జిల్లాలో మియార్ లోయలో ఉన్న 6,027 మీటర్ల ఎత్తైన మౌంట్ తరంగ్-II శిఖరాన్ని కామారెడ్డి గిరిజన సంక్షేమ డిగ్రీ కళాశాల విద్యార్థి విస్లావత్ బన్నీ విజయవంతంగా అధిరోహించారు. పది మంది సభ్యులతో కూడిన ట్రాన్స్‌సెండ్ అడ్వెంచర్స్ భారతీయ పర్వతారోహణ బృందంలో బన్నీ సభ్యుడిగా పాల్గొని ఈ ఘనత సాధించారు.

శిఖరాగ్రంపై భారత జాతీయ త్రివర్ణ పతాకంతో పాటు తెలంగాణ గిరిజన సంక్షేమ విద్యా సంస్థ కళాశాల ఫ్లెక్సీని ప్రదర్శించారు. దీంతో కళాశాలకు, కామారెడ్డి జిల్లాకు గర్వకారణంగా నిలిచారు.

రాజంపేట మండలం ఎల్లాపూర్ తండాకు చెందిన బన్నీ వ్యవసాయ కుటుంబ నేపథ్యం నుంచి వచ్చారు. గతంలో కిలిమంజారో, కాంగ్ యత్సే-1, లడక్‌లోని కైగర్ తదితర పర్వతాలను కూడా అధిరోహించారు. పట్టుదలతో పర్వతారోహణలో రాణిస్తున్న బన్నీ తాజాగా మౌంట్ తరంగ్-IIను అధిరోహించడం పట్ల ఆయన తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా గిరిజన సంక్షేమ విద్యా సొసైటీ కార్యదర్శి కె. సీతాలక్ష్మి, ఐఏఎస్ బన్నీ విజయంపై అభినందనలు తెలిపారు. గురుకుల సొసైటీతో పాటు కళాశాలకు ఇది గర్వకారణమని పేర్కొంటూ, బన్నీ భవిష్యత్తులో మరెన్నో విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.

కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎ. శ్రీనివాస స్వామి బన్నీని, ఆయనను ప్రోత్సహించిన పీడీ అనిల్ కుమార్ను ప్రత్యేకంగా అభినందించారు. కళాశాల అధ్యాపక బృందం, సిబ్బంది, విద్యార్థులు బన్నీ విజయాన్ని అభినందించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *