ప్రజలకు ప్రభుత్వ సేవలను మరింత వేగంగా, పారదర్శకంగా అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం కీలక అడుగు వేసింది. సర్కారీ సేవల కోసం మీసేవ కేంద్రాలు, ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే శ్రమను తగ్గిస్తూ “మీ సేవ డోర్ డెలివరీ” సర్వీసులను ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు లాంఛనంగా ప్రారంభించారు. బుధవారం ఆర్టీసీ కళ్యాణ మండపంలో జరిగిన కార్యక్రమంలో ఈ సేవలకు శ్రీకారం చుట్టారు.
ఈ నూతన విధానం ప్రకారం పౌరులు తమకు కావలసిన సర్టిఫికెట్లు లేదా సేవల కోసం 1100 టోల్ ఫ్రీ నంబర్‌కు కాల్ చేసి గానీ, మీసేవ పోర్టల్ ద్వారా గానీ ముందుగా స్లాట్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. స్లాట్ బుకింగ్ పూర్తయ్యాక మీసేవ ఎగ్జిక్యూటివ్ నేరుగా దరఖాస్తుదారు నివాసానికి వచ్చి వివరాలు సేకరించి సేవలు అందిస్తారు. ప్రాథమికంగా కుల, ఆదాయ, నివాస, జనన-మరణ ధ్రువీకరణ పత్రాలతో పాటు ఈసీ కాపీలు, పోలీస్ శాఖ, ఐజీఆర్‌ఎస్ రిజిస్ట్రేషన్ సర్వీసులను ఇంటి వద్దకే అందించనున్నారు. తొలిదశలో ఎంపిక చేసిన ప్రాంతాల్లో పైలట్ ప్రాజెక్ట్‌గా ప్రారంభమైన ఈ సేవలను నిర్వహించేందుకు 70 మందికి పైగా ఏజెంట్లకు ప్రత్యేక శిక్షణ ఇచ్చామని, త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా విస్తరిస్తామని అధికారులు వెల్లడించారు.
