భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయ అభివృద్ధి పనులను రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మహబూబాబాద్ ఎంపీ బలరాం నాయక్‌తో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఆలయానికి చేరుకున్న మంత్రికి, ఎంపీకి ఆలయ అధికారులు మంగళ వాయిద్యాలు, పూలమాలలతో ఘన స్వాగతం పలికారు.
ప్రధాన ఆలయంలో సీతారాముల వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం, వేద పండితులు వారికి శాలువాలతో సత్కరించి ఆశీర్వచనం అందజేశారు. వర్షం పడుతున్నప్పటికీ లెక్కచేయకుండా, బురదలోనే తిరుగుతూ ఆలయం ఉత్తరం, పడమర, దక్షిణం వైపులా జరుగుతున్న నిర్మాణ పనులను మంత్రి స్వయంగా పరిశీలించారు. తొలి విడతలో రూ.251 కోట్లతో చేపడుతున్న ఈ అభివృద్ధి పనులను నాణ్యతా ప్రమాణాలతో వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు. అర్చకుల విజ్ఞప్తి మేరకు ఉపాలయాలకు భూస్పర్శ కలిగేలా దక్షిణం వైపు నిర్మాణాలను చేపడతామని హామీ ఇచ్చారు. అనంతరం ముదిరాజ్ బజార్‌లో నిర్మించిన ఇందిరమ్మ ఇండ్లను పరిశీలించిన మంత్రి, ఆలయ పురోగతిపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

