Breaking News

ప్రభుత్వ ఆసుపత్రిలో ఎమ్మెల్యే మదన్ మోహన్ ఆకస్మిక తనిఖీ

వైద్యుల నిర్లక్ష్యంపై ఆగ్రహం.. రోగులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశం

ఎల్లారెడ్డి, నవంబర్ 06 (E6TV న్యూస్).

ఎల్లారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య సేవలపై రోగుల నుంచి అందిన ఫిర్యాదుల నేపథ్యంలో ఎమ్మెల్యే మదన్ మోహన్ ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ఆసుపత్రిలో రోగులకు అందుతున్న వైద్య సేవలు, సిబ్బంది పనితీరు, మౌలిక సదుపాయాలను స్వయంగా పరిశీలించారు.

ఈ సందర్భంగా విధుల్లో వైద్యులు, నర్సింగ్ సిబ్బంది అందుబాటులో ఉంటున్నారా లేదా అనే విషయాన్ని తెలుసుకునేందుకు హాజరు రికార్డులను తనిఖీ చేశారు. విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న వైద్యులు, నర్సింగ్ అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సమయపాలన పాటిస్తూ బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని, రోగులకు నిరంతరం అందుబాటులో ఉండాలని స్పష్టం చేశారు.అనంతరం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులతో నేరుగా మాట్లాడి వారికి అందుతున్న వైద్య సేవలు, ఎదురవుతున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రిలో ఏవైనా ఇబ్బందులు ఎదురైతే తన దృష్టికి తీసుకురావాలని సూచించారు.

ఆసుపత్రి పరిసరాల పరిశుభ్రత, శానిటేషన్ నిర్వహణపై కూడా ఎమ్మెల్యే ఆరా తీశారు. ఆసుపత్రి ప్రాంగణాన్ని ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచాలని, పారిశుద్ధ్య పనులను క్రమం తప్పకుండా చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే ప్రతి పేద రోగికి మెరుగైన వైద్య సేవలు అందించడం అధికారుల బాధ్యతని ఎమ్మెల్యే మదన్ మోహన్ స్పష్టం చేశారు. రోగులతో మానవీయ దృక్పథంతో వ్యవహరిస్తూ, ఆప్యాయతతో వైద్యం అందించాలని సూచించారు.

ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా ప్రభుత్వ ఆసుపత్రుల పనితీరుపై నిరంతర పర్యవేక్షణ కొనసాగిస్తామని ఎమ్మెల్యే పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *