Breaking News

విప్లవ విద్యార్థి ఉద్యమాలకు స్ఫూర్తి కామ్రేడ్ జంపాల చంద్రశేఖర్ ప్రసాద్

అమరత్వానికి 50 ఏళ్లు.. బోధన్‌లో పీడీఎస్‌యూ ఆధ్వర్యంలో భారీ విద్యార్థి ప్రదర్శన

బోధన్, నవంబర్ 06 (E6TV న్యూస్).

విప్లవ విద్యార్థి ఉద్యమాలకు కామ్రేడ్ జంపాల చంద్రశేఖర్ ప్రసాద్ అందించిన సేవలు, త్యాగాలు చిరస్మరణీయమని పీడీఎస్‌యూ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు ఆర్. గౌతమ్ కుమార్, కార్యదర్శి జన్నారపు రాజేశ్వర్ అన్నారు. జంపాల చంద్రశేఖర్ ప్రసాద్ 50వ వర్ధంతి సందర్భంగా బోధన్ పట్టణంలో పీడీఎస్‌యూ నిజామాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో భారీ విద్యార్థి ప్రదర్శన నిర్వహించారు.

శక్కర్ నగర్ చౌరస్తా నుంచి అంబేద్కర్ చౌరస్తా వరకు సాగిన ఈ ర్యాలీలో విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఫ్రెంచ్ విద్యార్థుల తిరుగుబాటు, నక్సల్బరీ, శ్రీకాకుళం ఉద్యమాల ప్రభావంతో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పురుడు పోసుకున్న పీడీఎస్‌యూ విద్యార్థి ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లడంలో జంపాల చంద్రశేఖర్ ప్రసాద్ కీలక పాత్ర పోషించారని పేర్కొన్నారు.

కామ్రేడ్ జార్జ్ రెడ్డి ఉద్యమ వారసత్వాన్ని కొనసాగిస్తూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా విద్యార్థి సంఘ నిర్మాణానికి కృషి చేశారని, విద్యారంగ సమస్యలు, విద్యార్థుల హక్కుల సాధన కోసం నిరంతరం పోరాడారని తెలిపారు. సమానత్వం, శాస్త్రీయ విద్యా విధానం, సమసమాజ స్థాపన లక్ష్యంగా ఆయన ఉద్యమించారని గుర్తుచేశారు. ఎమర్జెన్సీ కాలంలో పాలకుల నిర్బంధ చర్యలకు బలయ్యారని, ఆయన మరణించి 50 ఏళ్లు గడిచినా ఆశయాలు నేటికీ సజీవంగా ఉన్నాయని అన్నారు.దేశవ్యాప్తంగా విద్యార్థులు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారని, ప్రశ్నించే గొంతుకలపై పాలకుల నిర్బంధం కొనసాగుతోందని విమర్శించారు. విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఐక్యంగా పోరాడుతూ జంపాల చంద్రశేఖర్ ప్రసాద్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు.

పీడీఎస్‌యూ మాజీ రాష్ట్ర కార్యదర్శి, అడ్వకేట్ జి. శ్రీనివాస్ మాట్లాడుతూ.. ప్రజా ఉద్యమాలను అణచివేస్తూ ప్రజాస్వామిక హక్కులను కాలరాసిన ఎమర్జెన్సీ చీకటి రోజుల్లో జంపాల ప్రసాద్‌ను, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నీలం రామచంద్రయ్యను విజయవాడలో అరెస్టు చేసి ఖమ్మం జిల్లా ఇల్లందు తాలూకాలోని చీకటి గండ అడవుల్లో కాల్చి చంపారని ఆరోపించారు. ఈ హత్యలను ఖండిస్తూ దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమం జరిగిందని గుర్తుచేశారు.జంపాల చంద్రశేఖర్ ప్రసాద్ బోధన్ మండలంలోని ఎత్తొండ గ్రామానికి చెందినవారు కావడం ఈ ప్రాంత ప్రజలకు గర్వకారణమని పేర్కొన్నారు. ఆయన ఆశయాల సాధన కోసం సమాన విద్య, శాస్త్రీయ విద్య, సమసమాజ స్థాపన లక్ష్యంగా విద్యార్థులు ఉద్యమించాలని పిలుపునిచ్చారు. పాలకులు మారుతున్నా వారి విధానాల్లో మార్పు రావడం లేదని విమర్శిస్తూ, ప్రజావ్యతిరేక విధానాలపై విద్యార్థులు ప్రశ్నించాలని అన్నారు.

ఈ కార్యక్రమంలో పీడీఎస్‌యూ జిల్లా ఉపాధ్యక్షుడు ఎన్. కార్తీక్, సహాయ కార్యదర్శి ప్రిన్స్, కోశాధికారి సాయినాథ్, జిల్లా కమిటీ సభ్యులు పవన్, భవాని, ఆకాష్, హరికృష్ణతో పాటు పీడీఎస్‌యూ నాయకులు హనుమంత్ రెడ్డి, శ్రీకర్, సచిన్, వరప్రసాద్, పుష్పలత, భాను తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *