అహ్మదాబాద్‌లో నారా లోకేశ్ ఆపరేషన్ ఇన్వెస్ట్‌మెంట్..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పారిశ్రామిక ప్రగతిని పరుగులు పెట్టించడమే లక్ష్యంగా రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్, విద్యుత్‌శాఖ మంత్రి నారా లోకేశ్ గుజరాత్‌లోని అహ్మదాబాద్ నగరంలో తుఫాను పర్యటన కొనసాగిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా భారత్‌లోనే అత్యంత ప్రముఖ పారిశ్రామిక గ్రూపుల అధినేతలతో సమావేశమై, కూటమి ప్రభుత్వ పారిశ్రామిక విధానాలు, ఇస్తున్న ప్రోత్సాహకాలను వివరించారు. ఏపీకి వచ్చి భారీగా పెట్టుబడులు పెట్టాల్సిందిగా వారిని సాధరంగా ఆహ్వానించారు.

టోరెంట్ చైర్మన్‌తో క్లీన్ ఎనర్జీ ప్రాజెక్టులపై చర్చ:

టోరెంట్ గ్రూప్ చైర్మన్ సమీర్ మెహతాతో నారా లోకేశ్ సమావేశమయ్యారు. ఆంధ్రప్రదేశ్‌లో విస్తారంగా అందుబాటులో ఉన్న క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ (హరిత ఇంధన) వనరులను ఉపయోగించుకుని, భారీ ఎనర్జీ ప్రాజెక్టులను నెలకొల్పేందుకు ప్రభుత్వంతో భాగస్వామ్యం కావాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై స్పందించిన సమీర్ మెహతా.. ఏపీ ప్రభుత్వం ఇచ్చిన ప్రతిపాదనలపై అత్యంత సానుకూల ధోరణితో ముందుకు వెళ్తామని హామీ ఇచ్చారు.

వెల్స్‌పన్ గ్రూప్‌నకు ఆఫర్ల వర్షం:

వెల్స్‌పన్ గ్రూప్ సీఈఓ నితిన్ జైన్‌తోనూ మంత్రి ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఏపీలోని పలు ఆశాజనక ప్రాంతాల్లో ప్రాజెక్టులు ప్రారంభించాలని కోరారు:

  • కాకినాడ: ‘వెల్స్‌పన్ ఇండస్ట్రియల్ పార్క్’ స్థాపనతో పాటు టెక్స్‌టైల్స్, లాజిస్టిక్స్, పైపుల తయారీ యూనిట్ల ఏర్పాటు.
  • విశాఖపట్నం: ‘వెల్స్‌పన్ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్’ (GCC) నెలకొల్పడం.

ఏపీతో వెల్స్‌పన్ సుదీర్ఘ అనుబంధం:

రాయలసీమలోని కర్నూలు, కడప జిల్లాల్లో వెల్స్‌పన్ ఇప్పటికే 100 మెగావాట్ల సౌర విద్యుత్ ప్రాజెక్టును విజయవంతంగా నడుపుతోందని, అలాగే కేజీ-డీ6 ప్రాజెక్టు, కాకినాడ-శ్రీకాకుళం గ్యాస్ పైప్‌లైన్ నిర్మాణంలో భాగస్వామిగా ఉందనే విషయాన్ని ఈ సందర్భంగా లోకేశ్ గుర్తుచేశారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెంచేందుకు వెల్స్‌పన్ యాజమాన్యం కూడా సుముఖత వ్యక్తం చేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *