వాకింగ్‌కు వెళ్లి తిరిగి రాని లోకాలకు..
లారీ ఢీకొని మయూరి నగర్ వాసి బీకుమల్ల సత్యనారాయణ మృతి
ఘటనపై అనుమానాలు వ్యక్తం చేస్తున్న కాలనీవాసులు.. పోలీసుల దర్యాప్తు
అశోక్‌నగర్,సెప్టెంబర్ 21 (E6tv న్యూస్: ప్రతినిధి). పటాన్చెరు నియోజకవర్గ పరిధిలోని అశోక్‌నగర్ మయూరి నగర్ కాలనీలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఉదయం వాకింగ్‌కు వెళ్లిన ఓ వ్యక్తి తిరిగి ఇంటికి వస్తుండగా లారీ ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
కాలనీవాసులు తెలిపిన వివరాల ప్రకారం.. మయూరి నగర్లో నివాసం ఉంటున్న బీకుమల్ల సత్యనారాయణ ప్రతిరోజులాగే సోమవారం ఉదయం సుమారు 6 గంటల సమయంలో వాకింగ్‌కు వెళ్లారు. అనంతరం తిరిగి ఇంటికి వస్తుండగా వెనుక నుంచి వచ్చిన లారీ ఆయనను బలంగా ఢీకొట్టింది. దీంతో కిందపడిన సత్యనారాయణపై నుంచి లారీ వెళ్లడంతో తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలిపారు.
ఘటనపై కాలనీవాసుల అనుమానాలు
ఘటనపై కాలనీవాసులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. లారీ అంత వేగంగా వెనుక నుంచి ఎందుకు వచ్చిందనే ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. ఈ ఘటన ప్రమాదమా, డ్రైవర్ నిర్లక్ష్యమా లేదా మరేదైనా కారణం ఉందా అనే విషయాలపై సమగ్ర విచారణ జరపాలని వారు కోరుతున్నారు. కొందరు కాలనీవాసులు ఘటనను అనుమానాస్పదంగా పేర్కొంటూ తమ అనుమానాలను పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు.
ఇసుక లారీలతో ఇబ్బందులు
మయూరి నగర్ ప్రాంతంలో ఇసుక లారీలు అడ్డాగా నిలుస్తుండటంతో స్థానికులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కాలనీవాసులు తెలిపారు. లారీలను అక్కడ నిలపవద్దని పలుమార్లు సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ సమస్య పరిష్కారం కాలేదని ఆరోపించారు.
హైవే విస్తరణలో భాగంగా ఇరువైపులా సబ్వే నిర్మాణ పనులు పూర్తికాకపోవడంతో లారీలు రోడ్డుపక్కన నిలుపుతున్నారని తెలిపారు. లారీల రాకపోకలు, పార్కింగ్ కారణంగా ప్రమాదాల ముప్పు ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి లారీల పార్కింగ్ సమస్యను పరిష్కరించి, ప్రజల భద్రతకు చర్యలు తీసుకోవాలని కోరారు.
పోలీసుల అదుపులో లారీ డ్రైవర్
ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. లారీ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టినట్లు సమాచారం. ఘటనకు గల పూర్తి కారణాలు పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది.

