యాచారం ప్రాంతంలో ప్రతిపాదించిన ఫార్మాసిటీని రద్దు చేసి, ప్రభుత్వం సేకరించిన తమ భూములను వెంటనే తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ యాచారం మండలానికి చెందిన ఫార్మా బాధిత రైతులు సోమవారం ఇబ్రహీంపట్నంలోని ప్రజాభవన్‌ను ముట్టడించారు. పెద్ద సంఖ్యలో తరలివచ్చిన రైతులు ప్రజాభవన్ వద్ద ఆందోళనకు దిగడంతో అక్కడ కొంతసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.
ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని, జీవో నంబర్ 31ని ప్రయోగించి ఫార్మాసిటీ కోసం సేకరించిన భూములను తిరిగి రైతులకు అప్పగించాలని బాధితులు డిమాండ్ చేశారు. తమ భూముల సమస్యపై పలుమార్లు అధికారులకు విన్నవించినా ఫలితం లేకపోయిందని ఆవేదన వ్యక్తం చేసిన రైతులు, ఫార్మాసిటీ ప్రతిపాదనను రద్దు చేసి భూములు ఇచ్చే వరకు తమ పోరాటాన్ని ఆపేది లేదని స్పష్టం చేశారు.
