తెలంగాణ ఉద్యమానికి కొండా లక్ష్మణ్ బాపూజీ పెద్ద దిక్కు
బీఆర్ఎస్ హయాంలోనే బడుగు, బలహీన వర్గాలకు న్యాయం: వేముల ప్రశాంత్ రెడ్డి
కమ్మర్‌పల్లి, సెప్టెంబర్ 27:(E6tv NEWS: ప్రతినిధి)
తెలంగాణ తొలి, మలిదశ ఉద్యమాలకు కొండా లక్ష్మణ్ బాపూజీ పెద్ద దిక్కుగా నిలిచారని బాల్కొండ ఎమ్మెల్యే, మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. బాపూజీ చేసిన సేవలు, త్యాగాలను స్మరించుకోకపోతే తెలంగాణ సమాజాన్ని అవమానించినట్లేనని పేర్కొన్నారు.కమ్మర్‌పల్లి మండల కేంద్రంలో ఆదివారం కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన వేముల ప్రశాంత్ రెడ్డి బాపూజీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఎవరూ ముందుకు రాని రోజుల్లోనే మంత్రి పదవికి రాజీనామా చేసి ఉద్యమానికి అండగా నిలిచిన ధీరుడు కొండా లక్ష్మణ్ బాపూజీ అని కొనియాడారు. మలిదశ తెలంగాణ ఉద్యమం ప్రారంభ దశలో ఉద్యమకారులు సమావేశాలు నిర్వహించేందుకు సైతం ఇబ్బందులు ఎదుర్కొన్న సమయంలో బాపూజీ ధైర్యంగా ముందుకు వచ్చారని తెలిపారు.
తన సొంత నివాసమైన ‘జలదృశ్యం’ను తెలంగాణ ఉద్యమానికి, టీఆర్ఎస్ పార్టీకి అందించి ఉద్యమానికి కొండంత అండగా నిలిచారని ప్రశాంత్ రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం ఉన్నంతకాలం కొండా లక్ష్మణ్ బాపూజీ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారని అన్నారు.
బాపూజీ ఆశీస్సులు, ప్రోత్సాహంతో కేసీఆర్ నాయకత్వంలో ప్రజలు ఉద్యమంలో భాగస్వాములై తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నారని తెలిపారు. సాధించుకున్న తెలంగాణను దేశంలోనే నంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానిదేనని పేర్కొన్నారు.బడుగు, బలహీన వర్గాల సంక్షేమానికి బీఆర్ఎస్ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు, కార్యక్రమాలను అమలు చేసిందని వేముల ప్రశాంత్ రెడ్డి తెలిపారు. కొండా లక్ష్మణ్ బాపూజీ స్ఫూర్తితో బీఆర్ఎస్ పార్టీ బడుగు, బలహీన వర్గాల సంక్షేమం, సమగ్ర అభివృద్ధికి కట్టుబడి పనిచేస్తుందని అన్నారు.
కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రముఖులు, బాపూజీ అభిమానులు, కమ్మర్‌పల్లి మండల పద్మశాలి సంఘం ప్రతినిధులు, తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.




