రూ.40 లక్షలతో అయోధ్య రామ మందిర నిర్మాణానికి భూమిపూజ చేసిన మంత్రి సవిత
సోమందేపల్లి, సెప్టెంబర్ 20:(E6tv NEWS: ప్రతినిధి).
పెనుకొండ నియోజకవర్గంలో ఆధ్యాత్మిక, ధార్మిక క్షేత్రాల అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నట్లు రాష్ట్ర బీసీ సంక్షేమ, చేనేత జౌళి శాఖల మంత్రి సవిత తెలిపారు. సోమందేపల్లి మండల కేంద్రంలో టీటీడీ నిధులతో రూ.40 లక్షల వ్యయంతో నిర్మించనున్న అయోధ్య రామ మందిరానికి ఆదివారం మంత్రి సవిత భూమిపూజ నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. అయోధ్యలో శ్రీరామ మందిర నిర్మాణం సాకారం కావడం దేశ ప్రజలందరికీ గర్వకారణమన్నారు. అదే స్ఫూర్తితో పెనుకొండ నియోజకవర్గంలోని ఆలయాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. నియోజకవర్గ వ్యాప్తంగా టీటీడీ నిధులతో నాలుగు ఆలయాలు మంజూరయ్యాయని, అందులో భాగంగా సోమందేపల్లిలో రూ.40 లక్షలతో రామ మందిర నిర్మాణానికి భూమిపూజ చేసినట్లు చెప్పారు.
10 సెంట్ల స్థలంలో రామ మందిరాన్ని నిర్మించనున్నట్లు మంత్రి వెల్లడించారు. టీటీడీ ద్వారా త్వరలో 16 భజన మందిరాలకు అనుమతులు రానున్నాయని, అనుమతులు వచ్చిన వెంటనే వాటి నిర్మాణాలను చేపట్టి పూర్తి చేస్తామని తెలిపారు.
ఆలయాల అభివృద్ధికి భారీగా నిధులు
నియోజకవర్గంలోని పలు ఆలయాల అభివృద్ధికి నిధులు మంజూరైనట్లు మంత్రి వివరించారు.
- పరిగి వెంకటేశ్వర స్వామి ఆలయానికి – రూ.1.08 కోట్లు
- వడిగేపల్లి అమ్మవారి గోపురం నిర్మాణానికి – రూ.20 లక్షలు
- మరువపల్లి ఆంజనేయస్వామి ఆలయానికి – రూ.20 లక్షలు
- పెనుకొండ ఐముఖేశ్వర స్వామి దేవాలయానికి – రూ.3 కోట్లు
- వానవోలు రంగనాథ స్వామి దేవాలయానికి – రూ.2 కోట్లు
- రాగిమేకలపల్లి ఆంజనేయస్వామి ఆలయానికి – రూ.80 లక్షలు
మంజూరైనట్లు మంత్రి సవిత తెలిపారు.
సోమందేపల్లిలో రూ.3 కోట్లతో అభివృద్ధి పనులు
సోమందేపల్లి మండల కేంద్రంలో మౌలిక వసతుల అభివృద్ధికి కూడా ప్రాధాన్యత ఇస్తున్నామని మంత్రి తెలిపారు. త్వరలో రూ.3 కోట్లతో సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులు చేపట్టి పూర్తి చేస్తామని చెప్పారు.
అదేవిధంగా చాలకూరు రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జి పనులను నవంబర్ నాటికి పూర్తి చేసి ప్రారంభిస్తామని మంత్రి సవిత వెల్లడించారు.ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు.



