నిజామాబాద్–2 డిపో ఆధ్వర్యంలో సూపర్ లగ్జరీ బస్సు ఏర్పాటు
ఐదు ప్రముఖ పుణ్యక్షేత్రాల సందర్శనకు అవకాశం
పెద్దలకు రూ.2,500.. పిల్లలకు రూ.1,875 టికెట్ ధర
నిజామాబాద్, నవంబర్ 16: (E6tv NEWS).
కార్తీక మాసాన్ని పురస్కరించుకొని భక్తుల సౌకర్యార్థం తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) నిజామాబాద్–2 డిపో ఆధ్వర్యంలో ప్రత్యేక పుణ్యక్షేత్రాల యాత్రను ఏర్పాటు చేసినట్లు డిపో మేనేజర్ ఎం. శ్రీనివాస్ తెలిపారు.ఈ ప్రత్యేక యాత్రలో భాగంగా ఝరాసంగం శివాలయం, రేజింతల్ సిద్ధి వినాయక ఆలయం, బీదర్ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం, గాణుగాపూర్ శ్రీ దత్తాత్రేయ మందిరం, పండరీపూర్ విఠలేశ్వర ఆలయం వంటి ప్రముఖ పుణ్యక్షేత్రాలను భక్తులు దర్శించుకునే అవకాశం కల్పిస్తున్నట్లు వెల్లడించారు.
ఈ యాత్ర నవంబర్ 20వ తేదీ శుక్రవారం ఉదయం 6 గంటలకు నిజామాబాద్ నుంచి ప్రారంభమై, నవంబర్ 22వ తేదీ ఆదివారం ఉదయం 6 గంటలకు తిరిగి నిజామాబాద్ చేరుకుంటుందని తెలిపారు. భక్తుల సౌకర్యార్థం సూపర్ లగ్జరీ బస్సును ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.ఈ యాత్రకు పెద్దలకు రూ.2,500, పిల్లలకు రూ.1,875 టికెట్ ధరగా నిర్ణయించినట్లు తెలిపారు. కార్తీక మాసంలో పుణ్యక్షేత్రాలను దర్శించుకోవాలనుకునే భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ముందస్తు టికెట్ రిజర్వేషన్ కోసం నిజామాబాద్–2 డిపో అసిస్టెంట్ మేనేజర్ 7396594436, భాస్కర్ 9866649129 నంబర్లను సంప్రదించాలని సూచించారు. ఆన్లైన్లో టికెట్లు బుక్ చేసుకోవాలనుకునే వారు సర్వీస్ నంబర్ 99905 ద్వారా రిజర్వేషన్ చేసుకోవచ్చని తెలిపారు.మరిన్ని వివరాల కోసం నిజామాబాద్–2 డిపోను సంప్రదించాలని డిపో మేనేజర్ ఎం. శ్రీనివాస్ విజ్ఞప్తి చేశారు.
