ప్రమాదకరంగా వేలాడుతున్న విద్యుత్ తీగలను వెంటనే సరిచేయాలి: సిపిఎం నాయకులు అంకె ముత్యాలు
కొత్తచెరువు, సెప్టెంబర్ 20:(E6tv NEWS: ప్రతినిధి).
రాత్రి కురిసిన భారీ వర్షానికి కొత్తచెరువు పట్టణంలోని పెనుగొండ రోడ్డులో భారీగా వర్షపు నీరు నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సిపిఎం నాయకులు తెలిపారు. రోడ్డుపై నీరు నిలవడంతో పాఠశాలలు, కళాశాలలకు వెళ్లే విద్యార్థులతో పాటు వృద్ధులు, స్థానిక ప్రజలు రాకపోకలు సాగించేందుకు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు.
పెనుగొండ రోడ్డులో విద్యుత్ తీగలు ప్రమాదకరంగా వేలాడుతున్నాయని, వర్షపు నీరు నిలిచిన ప్రాంతంలో విద్యుత్ తీగలు ఉండటంతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని స్థానికులు ఆందోళన చెందుతున్నారని సిపిఎం నాయకులు తెలిపారు.ఈ నేపథ్యంలో సిపిఎం నాయకులు పెనుగొండ రోడ్డును సందర్శించి పరిస్థితిని పరిశీలించారు. ఈ సందర్భంగా సిపిఎం కొత్తచెరువు మండల కార్యదర్శి అంకె ముత్యాలు మాట్లాడుతూ, ప్రతి వర్షాకాలంలో పెనుగొండ రోడ్డులో వర్షపు నీరు నిలిచిపోతున్నప్పటికీ అధికారులు శాశ్వత పరిష్కారం చూపడం లేదని అన్నారు. సమస్యను పరిష్కరించాలని పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోకపోవడం బాధాకరమని పేర్కొన్నారు.
వెంటనే సంబంధిత అధికారులు స్పందించి రోడ్డుపై నిలిచిన వర్షపు నీటిని తొలగించాలని, డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరిచి శాశ్వత పరిష్కారం చూపాలని డిమాండ్ చేశారు. ప్రమాదకరంగా వేలాడుతున్న విద్యుత్ తీగలను విద్యుత్ శాఖ అధికారులు వెంటనే పరిశీలించి సరిచేయాలని కోరారు.పాఠశాలలు, కళాశాలలకు వెళ్లే విద్యార్థులు, వృద్ధులు, స్థానిక ప్రజల భద్రతకు ఎలాంటి ముప్పు కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని, ప్రజల ప్రాణాలకు ముప్పు కలిగించే సమస్యలపై అధికారులు నిర్లక్ష్యం చేయకుండా తక్షణమే స్పందించాలని సిపిఎం నాయకులు డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు లక్ష్మన్న, శీన, భాషతో పాటు స్థానికులు తదితరులు పాల్గొన్నారు.


