తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి విరుచుకుపడ్డారు. రేవంత్ రెడ్డి “నిజాయితీ గల మోసగాడు” అని, ఎన్నికల ముందు చెప్పినట్లే పాలనలో మళ్లీ పాత కష్టాల రోజులను తీసుకొచ్చారని ఎద్దేవా చేశారు. శనివారం తెలంగాణ భవన్లో మహబూబాబాద్ జిల్లాకు చెందిన పలువురు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్లో చేరిన సందర్భంగా కేటీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారు. “గత ఎన్నికల్లో ప్రజలు పాలిచ్చే బర్రెను కాదని, తన్నే దున్నపోతును తెచ్చుకున్నారు” అని వ్యాఖ్యానించిన కేటీఆర్, కాంగ్రెస్ పాలనపై ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
కేటీఆర్ ప్రసంగంలోని ముఖ్యాంశాలు:
- రైతుబంధు ఎగ్గొట్టారు: కేసీఆర్ హయాంలో నాట్లు వేసే సమయానికే రైతుల ఖాతాల్లో డబ్బులు పడేవని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే మూడుసార్లు రైతుబంధు నిలిపివేసి రైతులకు అన్యాయం చేసిందని మండిపడ్డారు. 100 రోజుల్లో ఆరు గ్యారెంటీలను నెరవేరుస్తామని చెప్పి మాట తప్పారని విమర్శించారు.
- 2028లో కేసీఆర్ సీఎం కావడం ఖాయం: రాబోయే రోజుల్లో తెలంగాణ రాజకీయం మారబోతోందని, 2028 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఘనవిజయం సాధించి కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి కావడం ఖాయమని పలు సర్వేలు స్పష్టం చేస్తున్నాయని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు.
- ఓటు నమోదు ప్రక్రియ: సెప్టెంబర్ 28 నుండి ప్రారంభమయ్యే పట్టభద్రుల (గ్రాడ్యుయేట్స్) ఓటు నమోదు ప్రక్రియలో యువత, ఉద్యోగులు పెద్ద ఎత్తున పాల్గొని కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాల వైఖరిని ఎండగట్టాలని ఆయన పిలుపునిచ్చారు.

