అందుబాటులో ఉన్న వనరులను సద్వినియోగం చేసుకోవాలి: మచ్చా రామలింగారెడ్డి
అనంతపురం, సెప్టెంబర్ 22:(E6tv NEWS: ప్రతినిధి).
గ్రామీణ ప్రాంతాల్లో దాగి ఉన్న క్రికెట్ ప్రతిభను గుర్తించి, వారికి సరైన శిక్షణ అందించి రాష్ట్ర, జాతీయ స్థాయి క్రికెటర్లుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా రూరల్ డెవలప్‌మెంట్ ట్రస్ట్ (RDT) ఆధ్వర్యంలో ‘రూరల్ క్రికెట్ టాలెంట్ హంట్’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు RDT క్రికెట్ అభివృద్ధి కమిటీ చైర్మన్ మచ్చా రామలింగారెడ్డి తెలిపారు.
అనంతపురం జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో ప్రతిభ ఉన్న యువ క్రికెటర్లు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. క్రమం తప్పకుండా సాధన చేయడంతో పాటు అందుబాటులో ఉన్న క్రీడా వనరులను పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని సూచించారు.టాలెంట్ హంట్‌లో భాగంగా నిర్వహించిన ఎంపిక ప్రక్రియకు 40 మంది అభ్యర్థులు హాజరైనట్లు రామలింగారెడ్డి తెలిపారు. ఎంపికైన ప్రతిభావంతులకు అనంతపురంలో శిక్షణా శిబిరాలు, మ్యాచ్‌లు నిర్వహించి వారి నైపుణ్యాలను మరింత మెరుగుపరిచేందుకు RDT కృషి చేస్తుందని చెప్పారు.
ఈ కార్యక్రమంలో ఆత్మకూరు RDT APC కృష్ణయ్య, సెలెక్టర్లు డి. ప్రదీప్, ఎస్.జె. షకీర్, ఎస్. ప్రవీణ్ కుమార్ రెడ్డి, RDT కోఆర్డినేటర్ ప్రవీణ్, కోచ్ జి. హరినాథ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా RDT APC కృష్ణయ్య మాట్లాడుతూ ఆత్మకూరు ప్రాంతంలో సహజసిద్ధమైన క్రీడా ప్రతిభకు కొదవలేదని, అథ్లెటిక్స్ ద్వారా పలువురు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించారని తెలిపారు. అనంతపురం జిల్లాలో క్రీడల అభివృద్ధికి RDT చేస్తున్న కృషిని వివరించారు.మోంచో ఫెర్రర్ మాట్లాడుతూ అనంతపురం, సత్యసాయి జిల్లాల్లో క్రీడల అభివృద్ధికి జరుగుతున్న కార్యక్రమాలను అభినందించారు. గ్రామీణ ప్రాంతాల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసేందుకు ‘రూరల్ క్రికెట్ టాలెంట్ హంట్’ ఉపయోగకరంగా ఉంటుందని పేర్కొన్నారు.

