Breaking News

బండ్లగూడకు వెళ్లే రెండు ప్రధాన రహదారులను 30 అడుగులకు విస్తరించాలి!

ఐలా మేనేజింగ్ డైరెక్టర్, జోనల్ మేనేజర్లకు వినతిపత్రం అందజేత

– మాజీ కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్.

పటాన్చెరు (E6tv న్యూస్), నవంబర్ 13: పటాన్చెరు నియోజకవర్గంలోని జేపీ కాలనీ డివిజన్ పరిధిలో బండ్లగూడకు వెళ్లే రెండు ప్రధాన రహదారులు పూర్తిగా దెబ్బతిని అధ్వాన స్థితికి చేరుకున్నాయని, వాటికి తక్షణమే మరమ్మతులు చేపట్టి ఆధునిక ప్రమాణాలతో నూతనంగా నిర్మించాలని మాజీ కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ కోరారు.ఈ మేరకు శుక్రవారం పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి లెటర్‌హెడ్‌పై ఐలా (టీజీఐఐసీ) మేనేజింగ్ డైరెక్టర్‌తో పాటు సంబంధిత జోనల్ మేనేజర్లను కలిసి వినతిపత్రం అందజేశారు.

ఈ సందర్భంగా మెట్టు కుమార్ యాదవ్ మాట్లాడుతూ.. బండ్లగూడకు వెళ్లేందుకు ప్రధానంగా రెండు రహదారులు ఉన్నాయని తెలిపారు. మొదటిది టాటా మోటార్స్ వద్ద నుంచి బండ్లగూడకు వెళ్లే మార్గం కాగా, రెండోది ఇక్రిశాట్ నుంచి బండ్లగూడకు వెళ్లే మార్గమని వివరించారు. ఈ రెండు రహదారులు సుమారు 20 ఏళ్ల క్రితం నిర్మించినవని, ప్రస్తుతం కేవలం 12 అడుగుల వెడల్పుతో ఉండటమే కాకుండా పూర్తిగా దెబ్బతిని రాకపోకలకు అనువుగా లేకుండా పోయాయని పేర్కొన్నారు.

ఈ మార్గాల్లో ప్రతిరోజూ భారీ పారిశ్రామిక వాహనాలు, ఇతర రవాణా వాహనాలు రాకపోకలు సాగిస్తుండటంతో తీవ్ర ట్రాఫిక్ సమస్యలు ఎదురవుతున్నాయని తెలిపారు. ముఖ్యంగా బండ్లగూడ ప్రాంత ప్రజలు ప్రయాణ సమయంలో అనేక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.బండ్లగూడ పరిసర ప్రాంతం పారిశ్రామిక వాడ పరిధిలో ఉండటంతో ఈ రెండు రహదారులకు పారిశ్రామిక అవసరాలతో పాటు స్థానిక ప్రజల రవాణా పరంగా కూడా ఎంతో ప్రాధాన్యత ఉందన్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఉన్న 12 అడుగుల రహదారులను 30 అడుగుల వెడల్పుకు విస్తరించి, నాణ్యతా ప్రమాణాలతో పటిష్టమైన నూతన రోడ్లు నిర్మించాలని అధికారులను కోరారు.

రోడ్ల విస్తరణ, నూతన నిర్మాణం పూర్తయితే భారీ వాహనాల రాకపోకలు సులభతరం కావడంతో పాటు స్థానిక ప్రజలకు సురక్షితమైన, సౌకర్యవంతమైన ప్రయాణ సదుపాయం అందుబాటులోకి వస్తుందని తెలిపారు.అధికారులు ఈ సమస్య తీవ్రతను క్షేత్రస్థాయిలో పరిశీలించి, స్థానిక ప్రజలు, పారిశ్రామిక సంస్థలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని యుద్ధప్రాతిపదికన రోడ్ల నిర్మాణ పనులు చేపట్టాలని మెట్టు కుమార్ యాదవ్ విజ్ఞప్తి చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *