Breaking News

రూ.530 కోట్లతో మియాపూర్–ఆల్విన్ ఫ్లైఓవర్, అండర్‌పాస్‌ల నిర్మాణం!

రోడ్డు విస్తరణ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన సిఎంసీ కమిషనర్ సృజన, ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ

శేరిలింగంపల్లి (E6tv న్యూస్), నవంబర్ 13: శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలో రోజురోజుకూ పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీని శాశ్వతంగా పరిష్కరించే లక్ష్యంతో ప్రభుత్వం రూ.530 కోట్ల వ్యయంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మియాపూర్–ఆల్విన్ 6 లేన్ల ఫ్లైఓవర్, రెండు అండర్‌పాస్‌ల నిర్మాణం, రోడ్డు విస్తరణ పనులు వేగంగా కొనసాగుతున్నాయి.ఈ అభివృద్ధి పనులను సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (సీఎంసీ) కమిషనర్ సృజన, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ గురువారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

ఈ ప్రాజెక్టులో భాగంగా హఫీజ్‌పేట్ నుంచి మియాపూర్ వైపు, బాచుపల్లి నుంచి ఆల్విన్ వైపు రెండు అండర్‌పాస్‌ల నిర్మాణంతో పాటు ఆరు లేన్ల ఫ్లైఓవర్, రోడ్డు విస్తరణ పనులు చేపడుతున్నారు. ఈ పనులు పూర్తయితే ఈ ప్రాంతంలో ట్రాఫిక్ సమస్యలు గణనీయంగా తగ్గడంతో పాటు వాహనదారులకు ప్రయాణ సమయం ఆదా కానుంది.ఈ సందర్భంగా సంబంధిత ఇంజనీరింగ్ అధికారులు క్షేత్రస్థాయిలో జరుగుతున్న పనుల పురోగతిని కమిషనర్, ఎమ్మెల్యేలకు వివరించారు. నిర్మాణ పనుల స్థితిగతులను పరిశీలించిన వారు, పనుల పురోగతిపై వివరాలు తెలుసుకున్నారు.

ఈ పర్యటనలో శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్ నారాయణ అమిత్, డిప్యూటీ కమిషనర్ శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ నాయకులు బాలింగ్ గౌతమ్ గౌడ్, సంబంధిత ఇంజనీరింగ్ అధికారులు, స్థానిక నాయకులు, కాలనీ వాసులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *